కొండగట్టు ఆంజనేయస్వామికి ప్రత్యేకపూజలు చేసిన పవన్ కళ్యాణ్
తెలంగాణలో కొండగట్టు ఆంజనేయస్వామికి నేడు ప్రత్యేకపూజలు చేయించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొండగట్టు ఆంజనేయస్వామిని తన ఇలవేల్పుగా భావిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారానికి ముందు తన వారాహి వాహనానికి కూడా ఇక్కడే ప్రత్యేకపూజలు చేయించారు. తర్వాతే ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపున కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసేటప్పుడు విద్యుత్ తీగలు తగులుకుని ప్రాణాపాయస్థితికి చేరుకున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి దయ వల్లనే కోలుకున్నానని పలు సందర్భాలలో చెప్పారు. ఇప్పటికే జనసేన పార్టీ అభిమానులు, పవన్ అభిమానులు కొండగట్టుకు చేరుకున్నారు. ఈ దేవస్థానంలో ప్రత్యేకపూజలు చేసి, మొక్కులు తీర్చుకోనున్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ముందు కొండగట్టులో ముడుపులు కట్టారు పవన్. వీటిని చెల్లించుకోవడానికే ఈ ఆలయానికి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గెలుపు అనంతరం తెలంగాణలో కూడా స్థానిక ఎన్నికలలో పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో కూడా బీజేపీతో పొత్తు అంశం ప్రస్తావనకు రావొచ్చని సమాచారం.

