అశోక్ గెహ్లట్ స్వామిభక్తి – 32 ఏళ్లుగా పదవులు తీసుకోని సోనియా కుటుంబం త్యాగం
ఉందా , లేదా అన్నట్లుండే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై చర్చలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు ఎవరుకాబోతున్నారు? రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరిస్తారా? రాహుల్ నిరాకరిస్తే ఆ పదవిని ఇంకెవరు చేపడుతారు? హస్తిన రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. షెడ్యూల్ మేరకు సెప్టెంబర్ 20న కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుని తీరతామన్న పార్టీ ఎలక్షన్ అథారిటీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మరో మూడు, నాలుగు రోజుల్లో జారీ చేసే అవకాశముంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన స్వామిభక్తిని ప్రదర్శించుకున్నారు. రాహుల్ గాంధీ తప్ప కాంగ్రెస్‌లో ఎవరూ లేరని మరోసారి ఆయన వ్యాఖ్యలతో ఋజువయ్యింది. జైపూర్‌లో మీడియాతో మాట్లాడిన గెహ్లాట్.. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలని దేశవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఏకగ్రీవంగా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సెంటిమెంట్‌ను రాహుల్ గాంధీ గౌరవించి పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టాలని గెహ్లాట్ పేర్కొన్నారు. ఒకవేళ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ముందుకురాకుంటే పార్టీ శ్రేణులు అసంతృప్తికి గురవుతారని, పరిణామాలు చాలా ప్రతికూలంగా మారతాయాని గెహ్లాట్ పెర్కొన్నారు.

పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీకే అప్పగించాలన్నది పార్టీ శ్రేణుల ఏకగ్రీవ అభిప్రాయంగా అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. ఈ పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ స్వయంగా ముందుకు వస్తే మంచిదన్నారు.గత 32 ఏళ్లుగా గాంధీ- నెహ్రూ కుటుంబీకులు ఎవరూ కూడా ప్రధాని, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి..ఇలా ఎలాంటి పదవులను చేపట్టలేదన్నారు. అలాంటి కుటుంబం అంటే మోదీగారికి ఎందుకు భయం పట్టుకుందో తెలియడం లేదన్నారు. 75 ఏళ్లగా భారతదేశంలో ప్రజాస్వామ్యం సజీవంగా ఉందంటే.. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని అన్నారు. ప్రజాస్వామ్యం సజీవంగా ఉన్నందునే నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని, కేజ్రీవాల్ ఢీల్లీ సీఎం కాగలిగారని అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. అంటే ప్రజలు మోదీని, కేజ్రీవాల్‌ను కోరుకుంటున్నట్లు పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా..

