ఏపీలో ఎన్నికల రణరంగానికి పార్టీల సమాయత్తం
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి నానాటికి పెరుగుతూ వస్తుంది అధికార పార్టీతోపాటు ప్రధాన ప్రతిపక్షాలు రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తమ తమ అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తున్నాయి. ఆయా పార్టీలు వెనుకబడిన నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ నేత, ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ దిశగానే అడుగులు వేస్తూ, రాబోయే ఎన్నికలలో అన్ని సీట్లు సాధించాలని కోరుకుంటున్నారు. రాబోయే 30 ఏళ్లపాటు తనకు సుస్థిర స్థానం ఉండేలా రకరకాల పథకాలు, పేర్లతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లను కేటాయిస్తామని చెబుతూ వస్తున్నారు. తాను నియమించుకున్న ఒక ప్రైవేట్ పొలిటికల్ స్ట్రాటజిస్టుల టీం తో వరుస బెేటీలు నిర్వహిస్తూ వారిచ్చిన నివేదికల ఆధారంగా అభ్యర్థుల తుది జాబితాను రూపొందించుకుంటున్నారు.

గత ఎన్నికల్లో 51% ఓట్లతో రికార్డు విజయాన్ని సాధించిన వైసీపీ గడచిన నాలుగేళ్లలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సీఎం జగన్ కు మరింత ఆదరణ పెరిగిందని చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం పల్లెల్లో అత్యధిక మంది జగన్ కు మద్దతుగా నిలబడుతున్నారు. అయితే పట్టణ ప్రాంతాల కొంత వెనుకబడినట్లు కనిపిస్తున్నప్పటికీ నవరత్నాలు పేదల అందరికీ ఇల్లు కార్యక్రమం ద్వారా పట్టణవాసులకు ఇల్లు ఇస్తుండటంతో ఈ ప్రాంతాల్లో కూడా గ్రాఫ్ పెరిగిందని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు తమ తమ గ్రాఫ్ పెంచుకోవాలని చివరిసారిగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలకు జగన్ సూచించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా 175 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గం నాయకులతో భేటీలు నిర్వహించి ఆ దిశగా అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తున్నారు. దసరా పండుగ నాటికి 80 మందితో తొలి జాబితాను ఆయన ముందుగా ప్రకటించబోతున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక జనసేన పార్టీ పొత్తుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి పొత్తు కుదిరితే మిగిలిన స్థానాలపై స్పష్టత రానుంది. తెలుగుదేశం, జనసేన పార్టీలు పూర్తిగా ప్రజల్లో ఉంటూ తమ పార్టీల బలోపేతానికి కృషి చేస్తున్నాయి. తమ కార్యకలాపాలను వేగవంతం చేస్తూ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. చంద్రబాబు, లోకేష్‌లు పాదయాత్రల పేరుతోనూ, పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతోనూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు, బీజేపీతో ఇప్పటికే పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. ఏది ఏమైనప్పటికి ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక కసరత్తుల పూర్తి చేసి పూర్తిస్థాయి ఎన్నికల రణరంగంలోకి దిగబోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.


