దేశంలో నేతల వరుస అరెస్ట్‌లతో..అట్టుడుకుతున్న పాకిస్తాన్
మొన్నటివరకు మన దాయాది దేశం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడిని విషయం తెలిసిందే. అయితే ఈ పరిస్థితి ఇంకా సద్దుమనగక ముందే ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. దీంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. కాగా ఇటీవల పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌తో పాకిస్తాన్ దేశం భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో అక్కడ పీటీఐ పార్టీ నేతల వరుస అరెస్ట్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి.

అయితే తాజాగా పీటీఐ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ విదేశాంగ శాఖమంత్రి షా మహ్మద్ ఖరేషీ అరెస్ట్ అయ్యారు. అయితే ఈయన ఇమ్రాన్ ఖాన్ అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. కాగా ఆయన్ను అరెస్ట్ చేసిన ఫోటోలను ఆ పార్టీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో సాధారణ దుస్తుల్లో వచ్చిన కొందరు ఖరేషీని తీసుకువెళ్తున్నట్లు కన్పిస్తోంది. కాగా ఇస్లామాబాద్ పోలీసులు తమ నేతను అరెస్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా పాకిస్తాన్‌లో ఇమ్రాన్ హయాంలో పనిచేసిన ఫవాద్ ఛౌదూరీ కూడా అరెస్ట్ అయ్యినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్‌లో తీవ్ర ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ ఘర్షణలను ఖండించిన పాకిస్తాన్ ఆర్మీ ఇవి పాకిస్తాన్ చరిత్రలోనే చీకటి అధ్యాయాలని పేర్కొంది. ఈ ఘర్షణల్లో నిరసనకారులు ఆర్మీకి చెందిన ఆస్తులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారని మండిపడింది. కాగా వీటిని తాము ఏమాత్రం సహించబోమని ఆర్మీ నిరసనకారులను హెచ్చరించింది. అయితే ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 8 మంది మరణించగా..1900 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

