ఒడిశా పోర్ట్‌లో పాక్ సిబ్బంది కలకలం..
నేటి ఉదయం దక్షిణకొరియా నుండి సింగపూర్ మీదుగా ఒడిశాలోని పరదీప్ పోర్టుకు ఒక నౌక చేరింది. దీనిలో ఉన్న మొత్తం సిబ్బందిలో 21 మంది పాకిస్తానీయులు ఉండడం కలకలం రేపింది. ఎమ్‌టీ సైరెన్ 2 అనే పేరుతో ఉన్న ఈ నౌకలో తనిఖీల సందర్భంగా ఈ విషయం వెల్లడయ్యింది. దీనితో అలర్టయిన సిబ్బంది పోర్టులో భద్రతను పెంచి హై అలర్ట్‌ను ప్రకటించారు. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఒడిశా మెరైన్ పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఈ నౌక పోర్టుకు 20 కిలోమీటర్ల దూరంలోని పీఎం బెర్త్ వద్ద లంగర్ వేసి ఉంది. దీనిలోని సిబ్బంది ఎవరూ నౌకను వీడకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దీనిలో పదకొండువేల టన్నుల ముడి చమురు ఉంది. దీని అన్‌లోడింగ్ పూర్తయ్యేంతవరకూ హై అలర్ట్ కొనసాగుతుంది.