అమ్మకానికి పాక్ ఎయిర్ లైన్స్
ప్రపంచ బ్యాంకు నుంచి కొత్త రుణాల కోసం ప్రయత్నించడంలో భాగంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అస్తవ్యస్త విధానాల కారణంగా అమెరికా వంటి దేశాల సిఫార్సుతో ప్రపంచ బ్యాంకు చేస్తున్న సాయం కూడా పాకిస్తాన్ కు సరిపోవడం లేదు . అయితే ఇప్పుడు ఏకంగా తమ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ సంస్థ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ను వేలం వేయాలని నిర్ణయించింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్తాన్, 7 బిలియన్ డాలర్ల ప్రపంచ బ్యాంకు బెయిల్ అవుట్ ప్యాకేజ్ పొందేందుకు షరతులు నెరవేర్చడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది . డిసెంబర్ 23న పీఐఏను వేలం వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎయిర్ లైన్స్ పూర్తి నిర్వహణ నియంత్రణతో సహా ఇందులో 51 శాతం వాటాల్ని అమ్మేయాలని నిర్ణయించింది. ఈ వేలానికి ముందస్తు అర్హత పొందిన నాలుగు కంపెనీలలో, సైనిక నియంత్రణలో ఉన్న ఫౌజీ ఫౌండేషన్‌లో భాగమైన ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ కూడా రేసులో ఉంది. ఈ ప్రైవేటీకరణ ద్వారా వచ్చే ఆదాయంలో 15 శాతం ప్రభుత్వానికి వెళ్తుందని, మిగిలినది కంపెనీలోనే ఉంటుందని పాకిస్తాన్ ప్రైవేటీకరణ మంత్రి ముహమ్మద్ అలీ తెలిపారు. కొత్త రుణ ప్యాకేజీ కోసం పాకిస్తాన్ ఈ వేలానికి సిద్ధమైంది.

