గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ సొంతం
మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ కారు గుర్తుకే మెజారిటీ సీట్లు
వికారాబాద్‌లో కాంగ్రెస్ గాలి వీచింది.
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అధికార బీఆర్ఎస్ సత్తా చాటింది. కోర్‌సిటీ (పాత ఎంసీహెచ్) పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ ఏడింట సిట్టింగ్‌లు ఉండగా, తిరిగి వాటిని కైవసం చేసుకుంది. ముషీరాబాద్ (ముఠా గోపాల్), అంబర్‌పేట (కాలేరు వెంకటేష్), ఖైరతాబాద్ (దానం నాగేందర్), జూబ్లీహిల్స్ (మాగంటి గోపీనాథ్), సనత్‌నగర్ (తలసాని స్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ (పద్మారావు నగర్) నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలే గెలుపొందారు.
కంటోన్‌మెంట్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందడంతో ఈసారి ఆయన కుమార్తె లాస్య నందితకు టిక్కెట్ ఇవ్వగా ఆమె గెలుపొందారు. గ్రేటర్ పరిధిలోనే ఉన్న రంగారెడ్డి జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు డి.సుధీర్‌రెడ్డి (ఎల్బీనగర్), ప్రకాష్‌గౌడ్ (రాజేంద్రనగర్), అరికపూడి గాంధీ (శేరిలింగంపల్లి), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం) తిరిగి గెలుపొందారు.
మేడ్చల్ జిల్లాలో 5 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. మల్కాజిగిరి జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు కూడా మూడోసారి గెలుపొంది, హ్యాట్రిక్ సాధించారు. ఉప్పల్ నుండి మొదటిసారి పోటీచేసిన బండారి లక్ష్మారెడ్డి గెలిచారు.
రంగారెడ్డిలో కారు గాలి వీచింది.. రంగారెడ్డి జిల్లాలోని 8 నియోజకవర్గాలకు గాను 5 చోట్ల బీఆర్ఎస్, 3 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.