స్థానిక ఎన్నికల్లో మాదే విజయం
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఉదయం మధిర క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ , బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఆర్ధికంగా నాశనం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్తోందని అన్నారు. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత కోసం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని తెలిపారు . ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి సర్వే నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించామన్నారు. ప్రజలకోసం కష్టపడుతున్న కాంగ్రెస్ పార్టీని బద్నామ్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందన్నారు . రైతు రుణమాఫీని 10 సంవత్సరాల్లో కూడా పూర్తిగా చేయలేకపోయారని డిప్యూటీ సీఎం విమర్శించారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కుంగిపోయింది అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పలు ముఖ్యమైన చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు. యువతకు 60,000 ఉద్యోగాలు కల్పించడమే కాకుండా గ్రూప్-1, గ్రూప్-2 నియామకాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. రైతుల కోసం 21 వేల కోట్ల రుణమాఫీ అమలు చేశామని, తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పిస్తున్నామని చెప్పారు. సన్నధాన్యం సాగు చేసే రైతులకు క్వింటాకు 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టి, ఇందుకోసం 22,500 కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలోని 1.05 కోట్ల కుటుంబాల్లో 96 లక్షల కుటుంబాలకు మనిషికి 6 కిలోల ఉచిత సన్నబియ్యం పంపిణీ జరుగుతోందని చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో 56 రూపాయలు కిలో ధర పలుకుతున్న సన్నబియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నామని గుర్తుచేశారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని, స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రతి ఏడాది 20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందజేస్తున్నామని చెప్పారు. ఐదు సంవత్సరాల్లో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కేవలం మాటలు కాదని, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకువస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.