Andhra PradeshHome Page Slider

ప్రపంచాన్ని చుట్టొచ్చిన మన తెలుగోడు..

ప్రపంచం మొత్తం తిరిగి రావాలంటే.. చేతి నిండా డబ్బు, బోలెడంత ఖాళీ సమయం ఉండాలి కదూ. కానీ భారీగా డబ్బు లేకున్నా.. కొత్త ప్రదేశాలకు వెళ్లి రావాలనే ఆసక్తి ఉంటే చాలని చెబుతున్నారు రవి ప్రభు. విశాఖపట్నానికి చెందిన ఈయన.. ఏకంగా ప్రపంచాన్నే చుట్టొచ్చాడు. మొత్తం 195 దేశాల్లో పర్యటించిన రవి ప్రభు ప్రపంచాన్ని చుట్టొచ్చిన 280 మందిలో ఒకరిగా నిలిచారు. అలాగే తొలి తెలుగు ట్రావెలర్ గా ఈ ఘనత సాధించి చరిత్రలో తన పేరును నమోదు చేసుకున్నారు. ప్రపంచ దేశాల్లో పర్యటించిన క్రమంలో ఆయన ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నారు. ప్రజల వస్త్రధారణ, ఆహార అలవాట్లు.. ఆయన్ను ఎంతగానో ఆకర్షించాయి.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ చేసిన ఆయన కొన్నేళ్ళ క్రితం అమెరికాలో స్థిరపడ్డారు. తొలిసారి భూటాన్ లో పర్యటించిన రవి చివరగా వెనిజులాలో 9 రోజులు గడిపి ఈ ఘనతను అందుకున్నారు. రవి ప్రభు ఒడిశాలోని తెలుగు కుటుంబంలో పుట్టినప్పటికీ ..ఆయన బాల్యం మొత్తం వైజాగ్ లోనే గడిచింది. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. రవి చిన్న తనంలోనే వీరి కుటుంబం దాదాపుగా భారత దేశం మొత్తాన్ని చుట్టేసింది. ఆయనకు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు భూటాన్ తీసుకెళ్లారు. 27 ఏళ్ల నుంచి పర్యటిస్తున్న ఆయన ఇప్పటివరకు దీని కోసం 35 కోట్లు ఖర్చు చేశారు. ఈయనకి ‘రవి తెలుగు ట్రావెలర్’ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దాదాపు 8 లక్షల మంది సబ్ స్కైబర్లు ఉన్నారు.