Breaking Newshome page sliderHome Page SliderTelangana

వచ్చేది మా ప్రభుత్వమే… ఎవ్వరినీ వదలం

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరైన సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో శుక్రవారం మాట్లాడారు. చట్టాన్ని అతిక్రమించి, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెడుతున్న అధికారులను భవిష్యత్తులో వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు.

రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న అధికారులతో సిట్ ఏర్పాటు చేసి, ప్రభుత్వం చెప్పినట్లుగా విచారణ జరిపించడం దుర్మార్గమని హరీశ్ రావు విమర్శించారు. “ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే.. మీరు ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి విచారిస్తాం” అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేపు అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు ఇప్పుడు అతి చేస్తున్న అధికారులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం ఉండదని, మీ సొంత డబ్బులతో లాయర్లను పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు.

కేసు విచారణకు సంబంధించి మీడియాకు తప్పుడు లీకులు ఇస్తున్న అధికారులపై కూడా హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌పై సోషల్ మీడియాలో, టీవీల్లో తప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇటువంటి కుట్రలు చేస్తున్నారని, తాము ఏ తప్పూ చేయలేదని, అందుకే కేటీఆర్ ధైర్యంగా విచారణకు హాజరయ్యారని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిపై కూడా అధికారులు విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.