InternationalNews

మా మంచి మోదీ.. ప్రపంచదేశాల నీరాజనం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పతకాస్థాయికి చేరుకుంటున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయ్. ఉజ్బెకిస్తాన్, సమర్‌కండ్‌లో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ సందర్భంగా మోదీ చేసిన కామెంట్స్‌పై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయ్. ఇది యుద్ధం చేసే కాలం కాదంటూ మోదీ రష్యా అధ్యక్షుడి భేటీ సందర్భంగా వ్యాఖ్యానించారు. మోదీ వ్యాఖ్యలను ఐక్యరాజ్యసమితి వేదికగా పలు దేశాధినేతలు మాట్లాడటం విశేషం. మొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్.. మోదీ భేష్ అంటూ మాట్లాడితే ఆ తర్వాత అమెరికా సైతం ఇండియా వ్యాఖ్యలకు హర్షం వ్యక్తం చేసింది. తాజాగా ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మెక్సికో సైతం స్పందించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పడానికి అంతర్జాతీయంగా అన్నీ దేశాలు కలసికట్టుగా పనిచేయాలని ఆ దేశ విదేశాంగ మంత్రి కామెంట్స్ చేశారు. మధ్యవర్తిత్వం కోసం భారత ప్రధాని మోదీ, పోప్ ఫ్రాన్సిస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్‌ సభ్యులుగా కమిటీ వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.