Home Page SliderNational

మణిపూర్‌లో ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ ఎంపీలు

మణిపూర్‌ సంఘటనలపై ఆరా తీయడానికి, క్షేత్రస్థాయిలో సిద్ధమవుతున్నారు ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’. నేడు (శనివారం) అక్కడకు చేరుకున్నారు. ‘ఇండియా’కు చెందిన 21 మంది ఎంపీల బృందం మణిపూర్‌లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. వారు మైతేయ్, కుకీ వర్గాలకు చెందిన వారితో మాట్లాడనున్నారు. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికే తాము ఇక్కడకు వచ్చామని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ఢిల్లీ నుండి విమానంలో ఇంఫాల్ వచ్చిన వారు, హెలికాఫ్టర్‌లో చురాచాంద్‌పుర్ చేరుకోనున్నారు. రెండు విడతలుగా హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తారు. అక్కడ గల పునరావాస కేంద్రాలలో ‘కుకీ’ వర్గ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో బిష్ణుపుర్ జిల్లాలోని ‘మైతేయ్’ వర్గ ప్రజల వద్దకు వెళ్లి, వారితో మాట్లాడనున్నారు. ఆదివారం నాడు మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉకియ్‌ను కలిసి అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించబోతున్నారు. ఇప్పటికే మణిపూర్ గవర్నర్ బాధిత కుటుంబాలను కలిసి ఓదార్చారు. వారికి అవసరమైన చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దర్యాప్తును కేంద్రం సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. దర్యాప్తును కొనసాగించి, తగిన చర్యలు తీసుకోనున్నారు.