ఆపరేషన్ కావేరి… సూడాన్ నుంచి ఇండియాకు భారతీయులు
ఐఎన్ఎస్ సుమేధ ద్వారా తరలింపు
జడ్డా నుంచి ఇండియాకు ప్రత్యేక విమానం
సుడాన్‌లో మూడు వేల మంది భారతీయులు
సురక్షితంగా తీసుకొస్తామంటున్న విదేశాంగ శాఖ
కల్లోల సుడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల మొదటి బృందం ఆ దేశం నుండి సౌదీ అరేబియాలోని జెడ్డాకు ఇండియన్ నేవీ యుద్ధనౌకలో బయలుదేరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐఎన్‌ఎస్ సుమేధ నౌకలో ఉన్న భారతీయుల ఫోటోలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. సూడాన్ నుంచి సురక్షితంగా తరలించినందకు కృతజ్ఞతలు తెలుపుతూ కొందరు జాతీయ జెండాను చేతబట్టి హర్షం వ్యక్తం చేశారు. “ఆపరేషన్ కావేరీ కింద చిక్కుకుపోయిన భారతీయుల మొదటి బ్యాచ్ సూడాన్ నుండి బయలుదేరింది. 278 మంది వ్యక్తులతో INS సుమేధ పోర్ట్ సుడాన్ నుండి జెడ్డాకు బయలుదేరింది” విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.

సైన్యం, పారామిలిటరీ బృందానికి మధ్య భీకర పోరు సాగుతున్న సూడాన్ నుండి తరలించబడిన భారతీయుల బృందంలో పిల్లలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆపరేషన్ కావేరీలో భాగంగా భారత్ రెండు రవాణా విమానాలను జెడ్డాలో, INS సుమేధను పోర్ట్ సుడాన్‌లో ఉంచింది. భారతీయులు జెడ్డా చేరుకున్న తర్వాత స్వదేశానికి తీసుకువస్తారు. సూడాన్‌లో సుమారుగా 3,000 మంది భారతీయులు ఉన్నారు. దేశ రాజధాని ఖర్తూమ్‌లోని పలు ప్రాంతాల నుంచి భీకర పోరాటాలు జరుగుతున్నట్లు వార్తలు రావడంతో సూడాన్‌లో భద్రత గాల్లో దీపంలా మారింది. గత వారం శుక్రవారం జరిగిన సమావేశంలో, సూడాన్ నుండి భారతీయులను తరలించడానికి ఆకస్మిక ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అధికారులకు చెప్పారు.
ఇరువర్గాల మధ్య 72 గంటల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఇవాళ రాజధాని ఖర్తూమ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు కాల్పులు జరిగాయి. వైమానిక దాడులు, ఫిరంగి బారేజీలతో సహా పది రోజులుగా జరుగుతున్న పోరాటంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇతర ప్రాంతాలలో ఉన్న వారి వారి దేశాల్లోని పౌరులను తీసుకెళ్లేందుకు రోడ్డు కాన్వాయ్‌లు, విమానాలు, ఓడల ద్వారా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంతో ప్రధాన ఏరియాల్లో కాల్పులు మోత ఆగింది. సుడాన్ ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్‌కు విధేయులైన శక్తులకు, మాజీ డిప్యూటీ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF)కి మధ్య జరుగుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం అప్పటి అధ్యక్షుడు ఒమర్ అల్-బషీర్ డార్ఫర్ ప్రాంతంలో విప్పిన జంజావీద్ మిలీషియా నుండి RSF ఉద్భవించింది. ఇది నాటి అధ్యక్షుడిపై యుద్ధ నేరాల ఆరోపణలకు కారణమయ్యింది.

