ఓపీ సేవలు బంద్.. రోగుల ఆందోళన
భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, పాఠశాలలకు తెలంగాణ సర్కార్ శుక్రవారం సెలవు దినంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే నగరంలోని నిమ్స్ ఆసుపత్రి వద్ద రోగులు ఆందోళనకు దిగారు. సర్కార్ సెలవు ప్రకటించిన విషయం తెలియకుండా వైద్య పరీక్షల నిమిత్తం నగరంలో వివిధ ప్రాంతాలు, ఇతర జిల్లాల నుంచి రోగులు పంజాగుట్టలోని నిమ్స్ కు చేరుకున్నారు. అయితే, వైద్యులు ఓపీ సేవలను నిలిపివేయడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్య సేవలను మినహాయించి మిగతా వాటికి సెలవు ప్రకటించాలని రోగులు కోరుతున్నారు. తాము చాలా దూరం నుంచి నగరానికి వచ్చామని మళ్లీ వెనక్కి ఎలా వెళ్లాలంటూ రోగులు తమ గోడును వెల్లబోసుకున్నారు.