NationalNews

ఒక్కరికి ఒక్క పోస్టు మాత్రమే.. రాహుల్ క్లారిటీ!

గెహ్లాట్ ఆశలపై రాహుల్ నీళ్లు
రాజస్థాన్ సీఎం పీఠం వదులుకోవాల్సిందే
ఏఐసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకోనని రాహుల్ క్లారిటీ
సందర్భాన్ని బట్టి రూల్స్ మారతాయంటున్న కాంగ్రె
స్

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‎కు త్వరలో బొమ్మ కన్పించబోతున్నట్టుగా కన్పిస్తోంది. ఎవరో ఒకరికి ఏఐసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టాలని నిర్ణయానికి వచ్చిన సోనియా, రాహుల్ గాంధీ… గెహ్లాట్ పెడుతున్న కండిషన్లతో చికాకుపడుతున్నారు. ఎంత చెప్పినా పెద్దాయన మనసు మారడం లేదని.. ఏం చేయాలో అర్థం కావడం లేదని తలలుపట్టుకుంటున్నారు. విధేయుడే కానీ.. పదవిపై మక్కువ ఎక్కువ పెంచుకున్నాడన్న ఆందోళనలో వారున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా ఒక పదవేనంటూ ఉదయ్‌పూర్ తీర్మానానికి కట్టుబడి ఉండాల్సిందేనని రాహుల్ తేల్చి చెప్పడంతో ఇప్పుడు అసలు లొల్లి మొదలవుతోంది. ఏఐసీసీ చీఫ్‌గా ఎన్నికైన తర్వాత కూడా తాను కొంత కాలం రాజస్థాన్ సీఎంగా ఉంటూనంటూ చేస్తున్న ప్రకటనలపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉంది.

పార్టీ విధేయుడిగా గెహ్లాట్‌కు పేరు
అశోక్ గెహ్లాట్ ఐనా మరెవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఒక్క పోస్టులో మాత్రమే ఉండాలని రాహుల్ గాంధీ ఇవాళ స్పష్టత ఇచ్చారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా తనను కలిసిన గెహ్లాట్‌కు రాహుల్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలట్‌ను నియమించాలని కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా కన్పిస్తోంది. ఇలాంటి తరుణంలో గెహ్లాట్‌ను అక్కడ్నుంచి కదలించేందుకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. వన్ పర్సన్ వన్ పోస్ట్ నినాదానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఇవాళ కేరళలో తనను ప్రశ్నించిన జర్నలిస్టులకు తేల్చి చెప్పారు రాహుల్ గాంధీ. ఏఐసీసీ చీఫ్ ‌గా తమకు అత్యంత ఆమోదయోగ్యుడైన వ్యక్తి కోసం చూస్తున్న గాంధీలకు అశోక్ గెహ్లాట్ కచ్చితమైన వ్యక్తి అన్న భావన ఉన్నప్పటికీ ఆయన రాజస్థాన్ సీఎం పీఠాన్ని వదులకోడానికి ఇష్టం చూపించకపోవడంతో కొంత అసహనంగా ఉన్నారు.

ఆనాడే పైలట్‌కు కాంగ్రెస్ హామీ
2020లో గెహ్లాట్‌పై పైలట్ తిరుగుబావుటా ఎగురేసినా… పార్టీలోనే కొనసాగారు. అందుకు కారణంగా గెహ్లాట్‌ను ఢిల్లీకి పిలిపించుకున్న తర్వాత.. సీఎంగా తనకే ఇస్తానన్న భరోసా ఇవ్వడం వల్లేనన్న వర్షన్ పార్టీలో ఉంది. గాంధీలు చెప్పినట్టుగా నడుచుకోవడంతో పైలట్‌కు సీఎం పీఠం అప్పగించేందుకు రంగం సిద్ధమైనట్టుగా కన్పిస్తోంది. ‌గెహ్లాట్ ఇవాళ రాహుల్ గాంధీతో భేటీ అయ్యే ముందు సచిన్ పైలట్ సుదీర్ఘంగా ఆయనతో జోడో యాత్రలో మొత్తం వ్యవహారంపై చర్చించినట్టు తెలుస్తోంది. సోమవారం కాంగ్రెస్ చీఫ్ బరిలో నిలవాల్సిన గెహ్లాట్.. చివరి సారిగా రాహుల్ గాంధీని ఏఐసీసీ చీఫ్ గా ఉండాలని విజ్ఞప్తి చేయాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని సోనియగాంధీకి చెప్పారు గెహ్లాట్. ఐతే ప్రస్తుతానికి ఏఐసీసీ ఛీప్ పదవి తాను తీసుకునే ఉద్దేశం లేదని రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో మరింత స్పష్టత ఇచ్చారు.

నమ్మకస్తుడే ఏఐసీసీ చీఫ్
మంత్రిగా ఉంటూ ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా కూడా పనిచేయొచ్చని… ఒక వ్యక్తి అవసరాన్ని బట్టి మూడు పోస్టులు కూడా చేయాల్సి ఉంటుందన్న వర్షన్ విన్పించారు గెహ్లాట్. వాటన్నింటినీ కొట్టిపారేశారు రాహుల్ గాంధీ. వన్ పర్సన్… వన్ పోస్ట్ అన్నది పరిస్థితులను బట్టి నిర్ణయించబడుతుందంటూ ప్రకటించారు మరో కాంగ్రెస్ ముఖ్యనేత కేసీ వేణుగోపాల్. మొత్తం వ్యవహారంపై సోనియాగాంధీతో మాట్లాడిన ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ విషయంలోనైనా, అది గెహ్లాట్ విషయంలోనైనా పార్టీకి నష్టం కలక్కుండా చూసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనప్పటికీ వారు సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని… పార్టీపై నమ్మకం ఉంచాలని… ఇండియా అభివృద్ధిపై విజన్ ఉండాలన్నారు రాహుల్ గాంధీ.