ఓటు హక్కు నమోదుకు ఓన్లీ 6 డేస్ మాత్రమే..
ప్రజాస్వామ్యానికి ఓటేపునాది. దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో సామాన్యుడి చేతిలో ఉండే వజ్రాయుధం ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అర్హులందరూ ఓటు హక్కును పొందడం కోసం ముందుగా ఓటరు నమోదు తప్పనిసరి.
చింతకాని: ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో సామాన్యుడి చేతిలో ఉండే సాధనమే ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ముందుగా నమోదు తప్పనిసరి. ఓటు హక్కు నమోదు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఈ నెల 30 వరకు టైమిచ్చింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల మందికి పైగా యువతీ, యువకులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగి ఉన్నట్లు సమాచారం.
పోలింగ్ శాతం పెంచేందుకే.. : రాష్ట్ర శాసనసభ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంపు, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందేలా అధికారులు పల్లెల్లో అవగాహనా చర్యలు చేపడుతున్నారు. ఈవీఎంల వినియోగంపై గ్రామాల్లో ప్రజలకు ఇప్పటికే అవగాహన కల్పించారు. మార్పులు, చేర్పులు, తొలగింపులు మినహా నూతనంగా ఓటర్ల నమోదుకు ఆన్‌లైన్‌లో మాత్రమే ఫాం-6 ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

