Andhra PradeshHome Page Slider

కల్తీ నెయ్యి నేరానికి తిరుమలలో కొనసాగుతున్న ప్రాయశ్చిత్తం

లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడకంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో టీటీడీ ప్రాయశ్చిత్తానికి పూనుకుంది. కల్తీ నెయ్యి వల్ల అపరాధం జరిగిందని భావిస్తూ శాంతియాగం, సంప్రోక్షణ మొదలు పెట్టారు. స్వామివారి నైవేద్యం తయారు చేసే బూందీ పోటు, లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటులలో పంచగవ్య సంప్రోక్షణం చేయాలని నిర్ణయించారు. దోష నివారణ నిమిత్తం ఆలయ యాగశాలలో వాస్తుయాగం, శాంతియాగం చేయాలని నిర్ణయించారు. తొలుత వాస్తు యాగం చేసి, లడ్డూ పోటు, విక్రయశాలలలో వాస్తుశుద్ధి చేయాలని, వాస్తు శుద్ధి అనంతరం శ్రీవారి ఆలయంలో శాంతిహోమం చేయాలని తీర్మానించారు. శాంతిహోమం ముగిశాక పూర్ణాహుతి నిర్వహించాలని, అనంతరం ఆలయంతో పాటు ప్రసాదాలు తయారు చేసే అన్ని వంటశాలలు, పోటులలో పంచగవ్య సంప్రోక్షణ చేయాలని నిర్ణయించారు. నేడు ఈ కార్యక్రమాలు మొదలుకానున్నాయి. లడ్డూలో కల్తీ నెయ్యి విషయంలో గత ప్రభుత్వంపై ప్రపంచం నలుమూలల నుండి తీవ్ర విమర్శలు ఎదురుకావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని, వైసీపీ నేత జగన్ ప్రధాని మోదీకి ఆరు పేజీల సుదీర్ఘ లేఖను రాశారు. ఈ విషయంలో అవసరమైతే సీబీఐ విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వం ఇలాంటి తీవ్రమైన ఆరోపణలతో రాజకీయం చేయడం, బురద జల్లడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.