పార్లమెంట్‌లో కొనసాగుతున్న వాయిదాల పర్వం
భారత్ పార్లమెంట్ ఉభయ సభలలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మణిపూర్ అంశంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నాయి. ఈ వర్షాకాల సమావేశాల మొదటిరోజే మణిపూర్ మహిళలపై జరిగిన అమానుష చర్యపై చర్చలు జరగాలని విపక్షాలు ఆందోళనలు చేశారు. రెండవరోజు కూడా ఇదే పునరావృతం అయ్యింది. ప్రధాని మోదీ సభలో సమాధానం చెప్పాలంటూ లోక్ సభలో డిమాండ్ చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

స్పీకర్ ఓం బిర్లా వీరికి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేస్తారని తెలిపినా వారు ప్రధాని మోదీ మాట్లాడాల్సిందేనని పట్టుబట్టారు. దీనితో ఈ సభను జూలై 24 వ తేదీ ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదేవిధంగా విపక్షాలు మణిపూర్ అంశంపై చర్చకు డిమాండ్ చేశాయి. తాము కొద్దిసేపు దీనిపై చర్చ జరుపుతామని, ప్రభుత్వం ప్రకటించినా ప్రతిపక్షాలు సంయమనం పాటించలేదు. దీనితో ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సభను మధ్యాహ్నం 2.30 వరకూ వాయిదా వేశారు.

