ఒక దేశం.. ఒకే ఆర్‌ఆర్‌బీ
ఒక దేశం ఒకే ఆర్‌ఆర్‌బీ ఉండాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా ప్రయోజనాలు, గ్రామీణ బ్యాంకుల ప్రయోజనాల దృష్ట్యా రీజినల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్, 1976ను అనుసరించి ఈ ఏకీకృత ప్రక్రియను అమలు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సంఖ్య 28కి తగ్గించనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పేరిట నాలుగు వేర్వేరు గ్రామీణ బ్యాంకులు సేవలందిస్తున్నాయి. వాటికి యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్డ్ బ్యాంకులుగా వ్యవహరిస్తున్నాయి. ఏకీకరణ ప్రక్రియ అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఒక్కటే రాష్ట్ర వ్యాప్తంగా సేవలందించనుంది. ఆర్‌ఆర్‌బీల్లో 50 శాతం వాటా కేంద్ర ప్రభుత్వం, 35 శాతం వాటా ప్రాయోజిత బ్యాంక్, 15 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉన్నాయి. దేశంలో ఒకప్పుడు 196 గ్రామీణ బ్యాంకులు ఉండేవి. గత పాతికేళ్లలో ఇంత వరకు మూడు దశల్లో చేపట్టిన ఏకీకరణ ప్రక్రియ వల్ల ఆ సంఖ్య 43కు తగ్గింది. ప్రస్తుతం చేపట్టబోతున్న నాలుగో విడత ప్రక్రియ ద్వారా ఈ సంఖ్య 28కి చేరనుంది.