ఆటగాళ్లు కాదు.. రెండు దేశాల ప్రధానులు ఒకే వేదికపై… ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్‌లో అపూర్వ ఘట్టం
రెండు కళ్లు చాలవన్నట్టుగా ఈ చిత్రాలు కన్పిస్తాయి. క్రికెట్ ప్రపంచంలో రెండు అత్యుత్తమ దేశాలు.. స్నేహపర్వంగా కూడా అంతకంటే ఎక్కువగా కలిసి ఉన్నాయన్న భావన.. అహ్మదాబాద్‌లో ఆవిష్కృతమయ్యింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈరోజు కలిసి క్రికెట్ మ్యాచ్ వీక్షించే ముందు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ రాకతో… స్టేడియంలో పెద్ద ఎత్తున హర్షధ్వానాలు, చప్పట్లతో స్వాగతం లభించింది. ఇండియా, ఆస్ట్రేలియా నాల్గో టెస్ట్ మ్యాచ్‌కు ముందు గోల్ఫ్ కార్ట్‌తో రూపొందించిన “రథం” లో నరేంద్ర మోదీ స్టేడియం చుట్టూ ఇద్దరు ప్రధాన మంత్రులు కలియ తిరిగి ప్రేక్షకులకు అభివాదం చేశారు.
“ఫీల్డ్‌లో, ఆస్ట్రేలియా, భారతదేశం ప్రపంచంలో అత్యుత్తమంగా ఉండటానికి పోటీ పడుతున్నాయి. ఫీల్డ్ వెలుపల, మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడానికి సహకరిస్తున్నాయి” అని ఆస్ట్రేలియా ప్రధాని ట్వీట్ చేశారు.
ఇరుదేశాల ప్రధానులు మోదీ, అల్బనీస్ జట్టు కెప్టెన్లు రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్‌లకు టెస్ట్ క్యాప్‌లను అందజేసి, ఆటగాళ్లజట్లతో కరచాలనం చేశారు. ఇరువైపుల ఆటగాళ్లతో ముచ్చటించారు. ఇండియా, ఆస్ట్రేలియా జాతీయ గీతాలు ఆలపించినప్పుడు వారి వెంట నిలబడ్డారు.
ఇద్దరు నాయకులు కూడా BCCI ద్వారా క్రికెట్ ద్వారా 75 సంవత్సరాల స్నేహానికి ప్రాతినిధ్యం వహించే ఫ్రేమ్డ్ ఆర్ట్‌వర్క్‌ను ప్రదర్శించారు.
భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాని బుధవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. అహ్మదాబాద్‌లో అపురూపమైన స్వాగతం లభించిందని… ఆస్ట్రేలియా-భారత్ సంబంధాల కోసం ఒక ముఖ్యమైన పర్యటన ప్రారంభమైందంటూ ఆయన ఇండియా వచ్చిన కొద్దిసేపటికే ట్వీట్ చేశారు. అల్బనీస్ మాట్లాడుతూ, తన పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంపొందించడానికి, స్థిరత్వం, వృద్ధికి శక్తిగా ఉండాలనే తాము భావిస్తున్నామన్నారు. అల్బనీస్‌కు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్వాగతం పలికారు. ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. రెండు దేశాలను ఏకం చేయడంలో క్రికెట్ ఎంతో విశిష్టమైనది… అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌ను మొదటి రోజున ఇద్దరు ప్రధానులు వీక్షించడం చాలా గొప్పగా ఉంటుందని ఆస్ట్రేలియా హైకమిషనర్ బారీ ఓ’ఫారెల్ అన్నారు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టులో గెలిస్తే ఇండియా గెలిస్తే ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అక్కడ జూన్ 7 నుండి లండన్‌లో ఆస్ట్రేలియాతో తలపడతారు.

