Home Page SliderNational

శ్రీరామ అనమంటే అంత ఉక్రోషమా!?

జనవరి 22న అయోధ్యలో జరిగే రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ప్రజలు రామ నామం జపించాలంటూ వీడియో సందేశం ఇవ్వడంపై నేపథ్య గాయని కెఎస్ చిత్రపై సోషల్ మాధ్యమాల సాక్షిగా విమర్శలు దాడి జరుగుతోంది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చిత్ర చేసిన వీడియోలపై విమర్శల దాడి తీవ్రమవుతోంది. రామమందిర ప్రారంభోత్సవ సమయంలో పవిత్రోత్సవం జరిగే సమయంలో మధ్యాహ్నం 12.20 గంటలకు ‘శ్రీరామ, జయ రామ, జయ జయ రామ’ మంత్రాన్ని జపించాలని చిత్ర వీడియో ద్వారా కోరారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అదే రోజు సాయంత్రం ప్రజలు తమ ఇళ్లలో ఐదు వత్తుల దీపాలను వెలిగించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దాంతోపాటు దేశంలోని ప్రతి ఒక్కరిపై సర్వేశ్వరుని ఆశీస్సులు కురవాలని కోరుకుంటూ “లోకా సమస్తా సుఖినో భవంతు” అనే సంస్కృత శ్లోకాన్ని పఠిస్తూ తన వీడియోను ముగించారు.

అయితే, చిత్ర వీడియో సందేశంలో ఇంటర్నెట్‌లో కొందరు హేళన చేశారు. చిత్ర ఇలా కోరడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆమె రామాలయానికి అంబాసిడర్‌గా ఉండటమేంటని కొందరు ప్రశ్నించారు. మరికొందరు, చిత్ర పొలిటికల్ స్టాండ్ తీసుకున్నారంటూ దుయ్యబట్టారు. ఐతే చిత్ర తీసుకున్న నిర్ణయంపై ఆమె మద్దతుదారులు, ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో చిత్రను విమర్శించినవారిపై దాడికి దిగారు. ప్రముఖ గాయకుడు వేణుగోపాల్, చిత్ర నిర్ణయాన్ని సమర్థించారు. సుదీర్ఘకాలం భారతీయ భాషల్లో సంగీతపరంగా ఆమె చేసిన సేవలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆయన మండిపడ్డారు. చిత్రపై చేసిన వ్యాఖ్యలు ఆమెను అవమానించాయని, బాధించాయి, ఇది తనను నిరుత్సాహపరిచిందని పేర్కొన్నారు. ఫేస్‌బుక్ పోస్ట్‌లో, ఆమె చేసిన వ్యాఖ్యలపై విమర్శకులకు ఏమైనా అభిప్రాయభేదాలు ఉంటే క్షమించాలని.. అంతేగానీ దాడి చేయడం కరెక్ట్ కాదన్నారాయన.

ఇటీవల త్రిసూర్‌లో బిజెపి నిర్వహించిన మహిళా సాధికారత కార్యక్రమంలో నటి శోభన ప్రధాని నరేంద్ర మోదీతో వేదికను పంచుకోవడంపైనా ఒక వర్గం ప్రజలు తీవ్రంగా విమర్శించారు. తాజాగా సింగర్ చిత్రపైనా సైబర్ దాడిని తీవ్రతరం చేశారు. కేరళకు చెందిన ‘వానంబాడి’… నైటింగేల్‌గా ప్రసిద్ధి చెందిన చిత్ర అనేక భాషలలో వేలాది పాటలు పాడారు. పలు రాష్ట్రాల్లోనూ అవార్డులు, రివార్డులతోపాటుగా జాతీయస్థాయిలోనూ మన్ననలు పొందారు.