Home Page SliderTelangana

“ఆరోజున ప్రతి హిందువు తమతమ ఇంట్లో దీపాలు వెలిగించండి”..కిషన్ రెడ్డి

జనవరి 22న అయోధ్యలో భవ్య రామమందర ప్రాణప్రతిష్ట మహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆరోజున ప్రతి హిందువు తమతమ ఇంట్లో దీపాలు వెలిగించి, కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేడు కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి.కిషన్ రెడ్డి  మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “బిజెపి శ్రేణులు, ప్రజలు పూర్తిస్థాయిలో భాగస్వాములై సమాజాన్ని అంతా ఏకం చేయాలి. జనవరి 22న దేశంలోని ప్రతి దేవాలయాన్ని అలంకరించి, దేవాలయాల ముందు స్క్రీన్లు ఏర్పాటు చేసి భవ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తులు వీక్షించేలా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.

డిసెంబరు 28వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి సమావేశం హైదరాబాద్ లో జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్ గారు, సునిల్ బన్సల్ గారు, బండి సంజయ్ గారు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ గారు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జులు పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్దంగా ఉండాలి. తెలంగాణలో అన్ని వర్గాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్ల సానుకూలంగా చర్చ జరుగుతోంది. గ్రామస్థాయి నుంచి అన్ని వర్గాల ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారికే ఓటు వేస్తామంటూ స్పష్టంగా చెబుతున్నారు. అవినీతిరహిత, కుటుంబ జోక్యం లేని, ప్రజా పరిపాలన దేశంలో మరోసారి రాబోతోంది. ఎవరూ ఊహించిన విధంగా అద్భుతమైన మెజారిటీతో నరేంద్ర మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధిస్తుంది. తెలంగాణలోనూ డబుల్ డిజిట్ తో మెజారిటీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. ప్రస్తుత దేశ పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారే మళ్లీ ప్రధానిగా ఉండాలని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు”. అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.