Home Page SliderTelangana

బంగారం కోసం వృద్దురాలి దారుణహత్య

హయత్‌నగర్‌లోని తొర్రూర్‌లో దారుణ హత్య జరిగింది. సత్తెమ్మ అనే వృద్దురాలిని బంగారం కోసం దారుణంగా కొట్టి చంపేశారు దుండగులు. గతరాత్రి వివాహానికి వెళ్లి ఇంటికి వచ్చి, పెద్దకుమారునితో ఫోన్‌లో మాట్లాడి నిద్రపోయిందట. పొద్దున్న వెనుక డోర్ తెరిచి ఉండడం, మంచంపై సత్తెమ్మ చనిపోయి ఉండడం చూసిన పొరుగింటివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్య గురించి తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మొయిన్ గేట్ మూసి ఉండడం, వెనుక డోర్ తెరిచి ఉండడంతో పోలీసులకు అనుమానం బలపడింది. ఇది తెలిసిన వాళ్లు చేసిన హత్యేనని కనిపెట్టారు.

బాగా విచారించగా ఆమె ఇంట్లోనే మరో గదిలో లలిత అనే స్త్రీ అద్దెకుంటున్నట్లు తెలుసుకున్నారు. ఆమె ఏమీ ఎరగనట్లు విచారణ సమయంలో జనం మధ్యలోనే ఉండడంతో ఆమెను ప్రత్యేకంగా విచారించారు. దీనితో ఆమె మరో నిందితుడు ఎండ్ల రాకేష్ అనే వ్యక్తితో కలిసి సత్తెమ్మను నగల కోసం హత్య చేసినట్లు అంగీకరించింది. ఈ రాకేష్ ఒక ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నాడు. అతని అన్న సత్తెమ్మ ఇంటి ముందే ఇల్లు నిర్మిస్తుండడంతో తరచూ వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే లలితతో పరిచయం చేసుకుని, అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సత్తెమ్మ ఎప్పుడూ ఒంటినిండా నగలతో కన్పించడంతో ఆశ పుట్టి లలితతో పథకం వేసి, ఆదివారం రాత్రి ఇంట్లో ప్రవేశించాడు. ఇద్దరూ కలిసి, సత్తెమ్మను గొంతునులిమి చంపేశారు. ఆమె ఒంటిపై ఉన్న దాదాపు 20 తులాల నగలను కాజేశారు. గంటల వ్యవధిలోనే హత్యను ఛేదించారు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, కొన్ని నగలు స్వాధీనం చేసుకున్నారు.