‘సీఎస్ సహా అధికారులు జైలుకు పోతారు’.. తెలంగాణకు సుప్రీం హెచ్చరిక
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తీవ్ర హెచ్చరికలు చేశారు. కంచగచ్చిబౌలి భూములలో నరికేసిన చెట్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని, లేదంటే కోర్టు ధిక్కరణ చర్యల కింద సీఎస్ సహా అధికారులు జైలుకు పోవాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 ఎకరాల ప్రాంతంలో ధ్వంసం చేసిన పచ్చదనాన్ని పునరుద్ధరించాలని, అందుకు సంబంధించిన ప్రణాళికను నాలుగు వారాలలోపు సమర్పించాలని గతంలోనే నిర్దేశించినట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మరికొంత సమయం కావాలంటూ తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించారు. వేల చెట్లను కొట్టివేయలేదని, కేవలం 147 చెట్లనే కొట్టివేశామని, వైల్డ్‌లైఫ్ వార్డెన్ కోసం చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. మరోవైపు విజిల్ బ్లోయర్లుగా వ్యవహరించిన 200 మంది విద్యార్థులపై కేసులు కొట్టివేయాలంటూ విద్యార్థుల తరపు న్యాయవాది విజ్ఞప్తికి ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూలై 23కి వాయిదా వేశారు.