స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైనా 8 మంది ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు
ఏపీ శాసన మండలికి రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థల నుండి ఎన్నికైన 8 మంది నూతన శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఈమేరకు సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు. రాష్ట్ర శాసన సభ సెక్రటరీ జనరల్ డా. పీపీకే.రామాచార్యులు నూతన ఎమ్మెల్సీల పేర్లను వరుస క్రమంలో పిలవగా శాసన మండలి అధ్యక్షులు మోషేన్ రాజు వారిచే ప్రమాణం చేయించారు. ఎమ్మెల్సీలుగా కడప స్థానిక సంస్థల నుండి ఎన్నికైన పి.రామసుబ్బా రెడ్డి, నెల్లూరు స్థానిక సంస్థల నుండి మేరిగ మురళీధర్, పశ్చిమ గోదావరి స్థానిక సంస్థల నుండి కవురు శ్రీనివాస్,వంకా రవీంద్రనాధ్, తూర్పు గోదావరి స్థానిక సంస్థల నుండి కుడిపూడి సూర్యనారాయణ రావు, శ్రీకాకుళం స్థానిక సంస్థల నుండి నర్తు రామారావు, చిత్తూరు స్థానిక సంస్థల నుండి సుబ్రహ్మణ్యం సిఫాయి,కర్నూల్ స్థానిక సంస్థల నుండి డా.ఎ. మధుసూదన్ ప్రమాణం చేశారు.
