ఎన్టీయార్ పోయింది.. వైఎస్సార్ వచ్చింది..
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. హెల్త్ యూనివర్సిటీకి అంకురార్పణ చేసిన నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరును తొలగించి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టడంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు చేస్తోంది. విజయవాడలో ధర్నా చేస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్టు చేశారు. హెల్త్ యూనివర్సిటీలోనూ, ఇతర నగరాలు, పట్టణాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అసలు హెల్త్ యూనివర్సిటీ ఎలా ఏర్పడింది..?

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ ప్లాన్..
ఎన్టీయార్ సీఎం పదవి చేపట్టే నాటికి వైద్య విద్యార్థులకు ప్రత్యేక యూనివర్సిటీ లేదు. వైద్య విద్యార్థులకు కూడా ప్రస్తుత ఆంధ్రా, ఎస్వీ, నాగార్జున యూనివర్సిటీలే సర్టిఫికేట్లు ఇచ్చేవి. ఆయా వర్సిటీలు సరైన పర్యవేక్షణ చేయకపోవడంతో నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికేట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. నకిలీ డాక్టర్లతో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. దీంతో వైద్య విద్యలో నాణ్యతను పెంచాలని.. పర్యవేక్షణ, నియంత్రణ కోసం స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రత్యేక యూనివర్సిటీని నెలకొల్పాలని ఎన్టీయార్ భావించారు.

1986లో ప్రారంభం..
హెల్త్ యూనివర్సిటీని విజయవాడలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం విశేషం. ఈ యూనివర్సిటీ నిర్మాణాన్ని విజయవాడలో 1986లో ప్రారంభించారు. అదే ఏడాది నవంబరు ఒకటి నుంచి అడ్మిషన్లు స్వీకరించారు. తొలుత దీని పేరు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఎన్టీయార్ చనిపోయిన రెండేళ్ల తర్వాత 1998లో నాటి సీఎం చంద్రబాబు నాయుడు ఈ వర్సిటీ పేరును ఎన్టీయార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మార్చారు. ఈ మేరకు వర్సిటీ యాక్ట్‌ను సవరించారు.

నాటి ప్రభుత్వాలూ పేరు మార్చాలనుకోలేదు..
తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా వైద్య విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఎలా అందించాలా.. అని ఆలోచించాయే తప్ప.. ఎన్టీయార్ పేరును మార్చే దిశగా ఆలోచించలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా సీఎంగా ఉన్నప్పుడు వర్సిటీల కార్యక్రమాల్లో జోక్యం చేసుకోలేదు. ఆ తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కూడా వర్సిటీ పేరు మార్చాలనుకోలేదు. పార్టీలకు అతీతంగా పాత తరం నాయకులు ఎన్టీయార్‌కు ఇచ్చిన గౌరవంగా దీన్ని చెప్పుకోవచ్చు.

ఎన్టీయార్‌పై గౌరవం ఉందంటూనే..
వైఎస్ మరణించిన తర్వాత కాంగ్రెస్ సర్కారు కడపలో నెలకొల్పిన హార్టికల్చర్ యూనివర్సిటీకి వైఎస్‌ఆర్ పేరు పెట్టింది. తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కూడా వైఎస్ పేరును మార్చాలని ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు సంక్షేమ పథకాలకు పేర్లు మార్చినట్లే.. యూనివర్సిటీ పేర్లు కూడా మార్చేస్తున్నారు. అయితే.. వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో భాగంగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు ఎన్టీయార్ జిల్లా అని పేరు పెట్టారు. ఎన్టీయార్‌ను టీడీపీ, చంద్రబాబు పట్టించుకోలేదని.. తమకు ఆయనపై గౌరవం ఉందని అప్పుడు జగన్ చెప్పారు. ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ కూడా ఎన్టీయార్ అంటే తనకు గౌరవం ఉందని జగన్ చెప్పుకోవడం విశేషం.