నేడు వెండితెర వేలుపు, నవరస నటనా చక్రవర్తి ఎన్టీఆర్ వర్థంతి
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దేశదేశాలకు చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. నేడు ఆయన 27 వర్థంతి. ఆయన బహుముఖప్రజ్ఞాశాలి. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ బిరుదాంకితుడు, నటరత్న. తెలుగు చలన చిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన మహానుభావుడు. తెలుగువారు పూజించే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అతడే. పౌరాణిక పాత్రలను కళ్లకు కట్టినట్లు చూపించిన గొప్పనటుడు. మనకు తెలియని రామాయణ, భారతాలను కట్టెదుట సాక్షాత్కరింపజేసిన యుగపురుషుడు. ఎన్టీఆర్ 1923 వ సంవత్సరం మే 28న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకట రావమ్మ, లక్ష్మయ్య. స్వగ్రామం నిమ్మకూరు. ఆయన తన నటజీవితంలో 55 జానపద చిత్రాలు, 18 చారిత్రక సినిమాలు, 186 సాఘిక చిత్రాలు, 48 పౌరాణిక చిత్రాలలో నటించి, వెండితెర వేలుపుగా ప్రేక్షకుల నీరాజనాలందుకున్నారు.

అంతేకాదు తనను ఎంతగానో అభిమానించే ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశ్యంతో 1982 వ సంవత్సరం, మార్చి 29 న తెలుగుదేశం అనే పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన ఏడాది తిరగకుండానే, అఖండ మెజార్టీ సాధించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పారు. తెలుగు ప్రజలు ఆయనను ఎంతగానో అభిమానించేవారు. 1996 వ సంవత్సరం జనవరి 18 వతేదీన మూడవసారి హార్ట్ ఎటాక్ రావడంతో కన్నుమూసారు.

నేడు ఆయన వర్థంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ కుటుంబసభ్యులతో కలిసి, హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆయన బిడ్డగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఆయన మనుమడు, తెలుగు పాపులర్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా తన అన్న కళ్యాణ్ రామ్‌తో కలిసి, ఆయనకు నివాళులు అర్పించారు.

