NationalNewsNews Alert

బాబు భద్రతపై ఎన్.ఎస్.జీ సమీక్ష.. అదనపు భద్రతకు ఏర్పాట్లు

రాజకీయంగా ఎదిగాక అన్ని సమస్యలు చుట్టూరా తారట్లాడుతూనే ఉంటాయి. అవకాశం కోసం పొంచి చూస్తూనే ఉంటాయి. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు కాటేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. నిర్లక్ష్యంగా ఉన్నా.. అప్రమత్తంగా లేకపోయినా ప్రాణాలు కూడా తీసేస్తాయి. అలా ప్రాణాలు కోల్పోయిన జాతి నేతలు ఎంతో మంది ఉన్నారు. మహాత్మాగాందీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ.. వీరంతా కూడా మహోన్నతమైన రాజకీయ నేపధ్యంలో ఎదిగిన వారే. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు ఉన్న నేతలే. కానీ.. భద్రత విషయంలో అనుసరించిన నిర్లక్ష్యం వీరి ప్రాణాలను తీసింది. నమ్మకంతో వచ్చి నేల కూల్చేశారు. ఇలాంటి పరిణామాలు పునావృతం కాకుండా ఉండేందుకు నేతల రక్షణ బాధ్యతలను అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్న విభాగం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. ఈ విభాగం ఇప్పుడు ఏపీ విపక్ష నేత చంద్రబాబు సెక్యూరిటీని మరింత పెంచబోతోంది. అదనపు భద్రతను కల్పించబోతోంది.


భక్తిపూర్వకంగా .. వినమ్ర నమస్సులతో దగ్గరికి వచ్చిన వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు మహాత్మాగాంధీని. సొంత భద్రతా సిబ్బందే తుపాకులెత్తి గుండెల్లో కాల్చారు ఇందిరాగాంధీని. పార్టీని గెలిపించాలని ప్రచారంలో ఉన్న రాజీవ్ గాంధీని శ్రీపెరంబదూర్ లో నేలకూల్చారు ఈలం తీవ్రవాదులు. ఇలాంటి పరిణామాలు దేశాన్ని ఒక్కసారిగా నివ్వెర పరిచాయి. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి. దేశాన్ని కన్నీటి సంద్రంలోకి నెట్టాయి. అలాగే మన భద్రతపై అనుమానాలనూ పెంచాయి. నేతల నిర్లక్ష్యం. భద్రతా సిబ్బంది లోపం ఇలా ఎన్నో ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. అలాంటివి పునరావృతం కాకుండా దేశంలోని అనేక మంది ప్రముఖులకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ గట్టి భద్రతను ఏర్పాటు చేస్తోంది. ఈక్రమంలోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు భద్రతకు ముప్పు ఉందన్న కారణంగా .. ఎన్ ఎస్ జీ అధికారులు విజయవాడలోని ఆయన నివాసాన్ని, పార్టీ కార్యాలయాన్ని సందర్శించి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎన్ఎస్జీ డీఐజీ సమర్దీప్ సింగ్ స్వయంగా బాబు భద్రతను సమీక్షించారు.


దేశంలోని వివిధ రంగాలకు చటెందిన ప్ముఖులకు వివిధ కేటగిరీల కింద నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ భద్రతవను కల్పిస్తున్నారు. దీంట్లో జడ్ ప్లస్ కేటగిరి కింద భద్రతను పొందుతున్న అతికొద్ది మంది నేతల్లో చంద్రబాబు కూడా ఒకరు. ఇటీవలి కాలంలో తరచూ టీడీపీ కార్యాలంలోకి కొంతమంది చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించడం.. ఉండవల్లిలోని ఆయన నివాసంపైకి దాడులు చేసేందుకు తెగించడం వంటి పరిణామాలు ఎంతో ఆందోళనపరిచాయి. ఈ నేపధ్యంలో బాబుకు భద్రతను ఒకసారి సమీక్షించాలని తెలుగుదేశం శ్రేణులు ఎన్ఎస్జీని కోరాయి. దీనికి తోడు కేంద్ర నిఘా విభాగం కూడా కొన్ని సంకేతాలు ఇవ్వడంతో .. రంగంలోకి దిగిన అధికారులు .. బాబుకు ఇస్తున్న భద్రతపై పూర్తిస్ధాయిలో సమీక్ష జరిపారు. ఆయనకు భద్రతను మరింత పెంచాల్సిన అవసరాన్ని గుర్తించడంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రబాబుకు కలపించిన భద్రతపై ఎన్ఎస్జీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా జిల్లాల పర్యటనల సందర్భంగా ఆయనకు నాలుగంచల భద్రతను కల్పించాల్సి ఉండగా. అందులో అనేక లోపాలను అధికారులు గుర్తించారని అంటున్నారు.


జడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న నేతలకు కల్పించాల్సిన భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేకమైన చర్యలు వంటివి బాబు విషయంలో కనిపించడం లేదని ఎన్ఎస్జీ అధికారుల దృష్టికి వచ్చింది. పోలీస్ శాఖ నిర్లక్ష్యంపై తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా చేశాయి. ఇక కుప్పం పర్యటనలో ఆయనపైకి కొందరు దాడులు చేసేందుకు దూసుకు వచ్చిన వైనంపై కూడ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఎన్ఎస్జీ విభాగం బాబుకు సెక్యూరిటీని మరింత పెంచుతోంది. ఇక కొంతకాలంగా ఆయనపై దాడులు చేస్తామని బహిరంగంగానే హెచ్చరికలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఏపీ రాజకీయాలలో చంద్రబాబుకు వ్యక్తిగత శత్రువులు బాగా పెరిగి పోవడంతో ఎన్ఎస్జీ అప్రమత్తమయ్యింది. జడ్ ప్లస్ రక్షణ కింద 10 మంది సాయుధ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కేటాయిస్తున్నారు. అలాగే ఆయన నివాసం వద్ద భద్రత కోసం మరో ఎనిమిది మందిని ఏర్పాటు చేశారు. గతంలో డీఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో భద్రత సిబ్బంది విధులు నిర్వహించేవారు. ఇకపై డీఐజీ ర్యాంకు అధికారి బాబు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. వీరు కాక రాష్ట్ర పోలీసు విభాగం కూడా విపక్ష నేతగా చంద్రబాబుకు భద్రత కల్పిస్తోంది.