Andhra PradeshHome Page SliderInternational

మన రాష్ట్రాభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వామ్యం కావాలి

రాష్ట్రాభివృద్ధిలో ఎన్నారైల పాత్ర

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్దిలో ప్రవాసులు(ఎన్నారైలు) భాగస్వాములు కావాలని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. అమెరికా దేశంలోని డల్లాస్‌లో నాటా-2023 సభలు జరుగుతున్నసభలనుద్దేశించి  ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ తన సందేశం పంపారు. ఆంధ్రరాష్ట్రానికి మీరు ఏ రకంగా ఉపయోగపడగలిగితే ఆ రకంగా ఉపయోపడండి. మీ అనుభవం చాలా అవసరం. ఇప్పటికే అభివృద్ది చెందిన ప్రాంతాల్లో మీరు ఇన్నేళ్లు అక్కడ ఉన్నారు. మీ అనుభవం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అవన్నీ కూడా మీరు ఇంకా ఎక్కువగా ఆంధ్రరాష్ట్రం మీద, మన గ్రామాల మీద ధ్యాస పెట్టగలిగితే మన రాష్ట్రానికి ఉపయోగపడతాయి” అని సీఎం జగన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధిని ఒక్కసారి ఎన్నారైలు అందరూ చూడాలని సీఎం జగన్ కోరారు. పోర్ట్‌లు,  ఎయిర్ పోర్ట్‌లు ఇప్పుడిప్పుడే మెరుగు పడుతున్నాయన్నారు. తెలుగు వారు అమెరికాలోని పెద్ద, పెద్ద కంపెనీల్లో సీఈఓలుగా, ఐటీ నిపుణులుగా, నాసా సైంటిస్టులుగా, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా, అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగులుగా, బిజినెస్‌మెన్‌గా, మంచి డాక్టర్లుగా రాణిస్తున్న తీరు గర్వం కలిగిస్తుందని అన్నారు. తెలుగు వారు అక్కడ ఉన్నప్పటికి వారి మూలాలు, మన మట్టిలో ఉన్నాయని అన్నారు. అనేకమంది పేద, మధ్య తరగతి కుటుంబాల్లో నుంచి వచ్చినా, అక్కడకి వెళ్లి రాణించడం వెనుక, ఎంతో కఠోరమైన కమిట్‌మెంట్, ఫోకస్‌ వారిని నిలబెట్టాయన్నారు.

ఉత్తమ విద్యా సంస్కరణల అమలు

ఆంధ్రప్రదేశ్‌లోని చిన్నారుల్లో కూడా కమిట్‌మెంట్, ఫోకస్‌ తన కళ్లారా చూశానని సీఎం జగన్‌ అన్నారు. ఆకాశాన్ని దాటి వెళ్లాలన్న కోరికతో ఉన్న వారు ఎదగాలంటే, అందుకు వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలన్న తపనతో నాలుగేళ్ల కాలంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేగలిగామని చెప్పారు.  మన బడి నాడు-నేడు అనే గొప్ప కార్యక్రమం ఏపీలో అమలు చేస్తున్నామని, దీంతో ప్రతి ప్రభుత్వ బడిలో మౌలికసదుపాయాలు కల్పిస్తూ.. రూపురేఖలన్నీ మారుస్తున్నట్లు సీఎం తెలిపారు. ఎనిమిదో తరగతిలోకి రాగానే ప్రభుత్వ బడిలో చదువుతున్న పిల్లలకు, ట్యాబ్‌లు ఇస్తున్నామన్నారు. అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యా కానుక, ఉన్నత విద్యలో అయితే విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలన్నీ రాష్ట్రంలో గొప్పగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ను స్కూలు పిల్లలు చదువుతున్నారని అన్నారు. ఇంగ్లీషు అన్నది ప్రపంచంలో విజ్ఞానాన్ని మనం నేర్చుకునేందుకు, చదువుకునేందుకు ఉపయోగపడే ఒక గొప్ప మీడియంగా జగన్ అభివర్ణించారు.  పిల్లలు తమకు తాముగా ఏ సబ్జెక్‌ మీద అయినా అవగాహన పెంచుకోవాలన్నా ముందు వారికి ఇంగ్లీష్‌ మీద పూర్తిస్థాయిలో పట్టు రావాలని అందుకే సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టామని చెప్పారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నెంబర్ వన్..

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరసగా మూడు సంవత్సరాలు నుంచి దేశంలోనే ఆంధ్రరాష్ట్రం మొదటి స్ధానంలో కనిపిస్తోందని సీఎం జగన్‌ తెలిపారు. సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌లో కూడా రాష్ట్రం ఇవాళ టాప్‌ 4,5 స్ధానాల్లో కనిపిస్తుందన్నారు. మన గడ్డ మీద మనందరి ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, ఇళ్ళ నిర్మాణం, రాబోయే తరం పిల్లల అభివృద్ధి, మహిళా సంక్షేమం, వృద్ధులు–వితంతువులు–దివ్యాంగుల సంక్షేమం, సామాజిక న్యాయం, లంచాలకు తావులేకుండా, వివక్షకు చోటు లేకుంగా జరుగుతున్న పరిపాలనా సంస్కరణల పరంగా చూసినా, వికేంద్రీకరణపరంగా చూసినా, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల పరంగా… ఇలా ప్రతి ఒక్క విషయంలో దేశంలోనే ఒక గొప్ప మార్పు.. ఆంధ్రరాష్ట్రంలో జరుగుతుందని” సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాటా కార్యక్రమంలో పాలుపంచుకొంటున్న అందరికీ మంచి జరగాలని,  అమెరికాలో ఉన్న తెలుగువాళ్లు అందరికీ హృదయపూర్వక నమస్కారాలతోపాటు, అభినందనలు అని తన సందేశంలో సీఎం జగన్ తెలియజేశారు.