InternationalNews

అమెరికాలో ఎన్నారై కుటుంబం కిడ్నాప్‌.. హత్య

అమెరికాలో దారుణం జరిగింది. కాలిఫోర్నియాలో 8నెలల చిన్నారి సహా భారత సంతతికి చెందిన నలుగురితో కూడిన ఓ కుటుంబాన్ని కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. వీరి మృతదేహాలను పోలీసులు కాలిఫోర్నియాలోని ఓ తోటలో గుర్తించారు. మెర్సిడ్‌ కౌంటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌ జిల్లా హర్‌సిపింద్‌ గ్రామానికి చెందిన జస్దీప్‌ సింగ్‌ (36), ఆయన భార్య జస్లీన్‌ కౌర్‌ (27), వాళ్ల 8 నెలల చిన్నారి అరూహీ ధేరీ, చిన్నారి మామ అమన్‌దీప్‌ సింగ్‌ (39) 15 ఏళ్ల క్రితం అమెరికాకు వలస వెళ్లారు.

ట్రక్కుల రవాణా వ్యాపారం చేసే జస్దీప్‌ సింగ్‌ తన భార్య, చిన్నారి కూతురితో కలిసి రోజు మాదిరిగానే సోమవారం తన కార్యాలయానికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత వారి సమీప బంధువు అమన్‌దీప్‌ కూడా అక్కడికి వచ్చాడు. ఇంతలోనే ఓ దుండగుడు తుపాకి చేతబట్టి వారి కార్యాలయంలోకి వెళ్లాడు. తుపాకితో బెదిరించి వారిని ఓ ట్రక్కులో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. కిడ్నాప్‌కు గురైన వారిలో ఒకరి కారు వారి కార్యాలయానికి సమీపంలో అదే రోజు సాయంత్రం దహనమైంది. దీంతో సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులకు కిడ్నాప్‌ గురించి తెలిసింది.

వారి ఆచూకీ కోసం ప్రయత్నించిన పోలీసులకు కిడ్నాపర్లు ఎలాంటి క్లూ ఇవ్వలేదు. అయితే.. కిడ్నాప్‌ అయిన వారిలో ఒకరి బ్యాంకు కార్డును మంగళవారం ఉదయం దుండగుడు స్థానిక ఏటీఎంలో ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఆ దుండగుడిని అరెస్టు చేశారు. పోలీసు కస్టడీలో ఉండగా ఆ దుండగుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే.. బాధితుల కోసం వెతుకుతుండగా వారి మృతదేహాలు బుధవారం సాయంత్రం ఓ తోటలో లభించాయి. ఓ దుండగుడిని అరెస్టు చేయడంతో కిడ్నాపర్‌ వారిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.