NationalNews

మధుమేహ రోగులకు NPPA గుడ్‌న్యూస్

దేశంలోని మధుమేహ రోగులకు జాతీయ ఔషద ధరల నియంత్రణ సంస్థ తీపి కబురు చెప్పింది. మధుమేహంతోపాటు వివిధ వ్యాధుల నియంత్రణకు వినియోగించే 45 రకాల మందుల ధరను తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. జీర్ణాశయ సమస్యలు ,జలుబు,కొలెస్ట్రాల్ ,నొప్పి నివారణలకు వాడే ముఖ్యమైన ఔషదాలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం మధుమేహ వ్యాధిగ్రస్తులు వినియోగించే సిటాగ్లిప్టిన్+మెట్‌ఫామిన్,లినాగ్లిప్టిన్ + మెట్‌పామిన్ వంటి సమ్మిళిత ఔషదాలను NPPA సవరించిన  ధర జాబితాలో చేర్చింది.

అయితే సిటాగ్లిప్టిన్‌పై మెర్క్‌షార్ప్ అండ్ డోమ్ కు ఉన్న పేటెంట్ రైట్స్ కాలపరిమితి గతనెలలోనే ముగిసింది. దీంతో అనేక రకాల సిటాగ్లిప్టిన్ జనరిక్ ఔషదాలు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. పేటెంట్ రైట్స్ ముగియడంతో తగ్గిన ధరల ప్రయోజనాన్ని ప్రజలకు అందిచాలన్న ఉద్దేశ్యంతో NPPA ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం 15 మాత్రలు కలిగిన సిటాగ్లిప్టిన్+ మెట్‌ఫామిన్ ప్యాక్‌ను మార్కెట్‌లో గరిష్టంగా రూ.345/- లకు విక్రయిస్తున్నారు. తాజాగా సవరించిన ధర ప్రకారం NPPA ఒక్కో మాత్ర ధరను రూ.16-21 మధ్యకు తీసుకువచ్చింది. మరోవైపు లినాగ్లిప్టిన్ + మెట్‌ఫామిన్ పై ఉన్న పేటెంట్ రైట్స్ కూడా వచ్చే నెలలో ముగియనున్నాయి. దీంతో NPPA ఈ మాత్రల ధరలను సహితం నియంత్రించింది.  ఒక్కో మాత్ర ధరను రూ.16-25గా నిర్ణయించింది. దీనిలో 2.5 ఎంజీ మాత్ర ధరను రూ.16.17, 5 ఎంజీ మాత్ర ధరను రూ.25.33గా స్థిరీకరించింది. ప్రస్తుతం టైప్-2 మధుమేహంతో బాధపడుతున్న వారిలో 30% మందికి గ్లిప్టిన్ ఆధారిత ఔషదాలను సిఫారసు చేస్తున్నామని వైద్య నిపుణులు వెల్లడించారు.