Andhra PradeshHome Page Slider

ఇకపై ఏపీలో ఇసుక పొందాలంటే..ముడుపు చెల్లించాల్సిందేనా?

ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక పాలసీని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే దీని ద్వారా ఇసుక పొందాలంటే GO నెంబర్ 43 ప్రభుత్వ విధి విధానాలను పాటించాలి. ఉదాహరణకు సొంత ఇంటి నిర్మాణానికి ఇసుక కోసం స్ధానిక MRO/VRO అనుమతి తప్పనిసరి. మనం నిర్మాణం చేపట్టే ఇంటి కొలతలను బట్టి అధికారులు ఎంత అవసరమో గుర్తించి అంతమేరకు మాత్రమే ఇసుక అనుమతిస్తారు. ఇంటి కొలతలతో పాటు ఇసుక వినియోగదారుని వ్యక్తిగత వివరాలు ఆధార్ కార్డు,ఫోన్ నంబరుతోపాటు ఇసుక తరలించే వాహనం నంబరు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇసుక ధర రుసుములను డిజిటల్ రూపంలో మాత్రమే చెల్లించాలి.కాగా రోజుకు 20 టన్నుల ఇసుక మాత్రమే తీసుకెళ్లేందుకు నిబంధన ఉంది. ఇసుక అక్రమంగా నిల్వ చేస్తే క్రిమినల్ కేసులతోపాటు రూ.2 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.ఇసుక అనుమతి ధృవీకరణ పత్రాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం ఇసుక రీచ్ వద్ద ఒక టన్నుకు రూ.250 / లు చొప్పున చెల్లించవలెను. రవాణా ఛార్జీల కింద నిర్ణీత దూరాన్ని బట్టి కొనుగోలుదారుడు భరించి తీసుకువెళ్లాలి. అధికారులు అనుమతించిన మేరకు మాత్రమే వినియోగదారుడికి ఇసుక లభ్యమవుతుంది. ఈ పద్దతి ద్వారా ఇసుక అక్రమ మార్గాన వెళ్లకుండా కేవలం వినియోగదారులకు మాత్రమే అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానం వల్ల రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులకు ఇసుక మరింత సులభతరం అయ్యే అవకాశముంటుందని సామాన్యులకు కష్టాలు తప్పవని చర్చ జరుగుతోంది.దీంతో సామాన్యులు ఇసుక మంజూరు కోసం స్ధానిక అధికారుల అనుమతులు పొందాలంటే ముడుపులు ముట్టచెప్పక తప్పదని భావిస్తున్నారు.గత ప్రభుత్వంలో ఇసుక పొందేందుకు ప్రభుత్వ అధికారుల నుంచి ఎటువంటి ధృవీకరణ పత్రాలు అవసరం లేదు. ఆన్ లైన్ విధానం ద్వారా టన్నుకు రూ.550/- లు చొప్పున చెల్లించి రీచ్‌ల వద్ద లోడింగ్ చేసుకుని రవాణా ఖర్చులు భరించి తీసుకువెళ్లేవారు. ఇప్పటి పరిస్ధితిని బట్టి ఇసుక విధానం సులభతరమని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా సామాన్యులకు మాత్రం అందని దాక్షలా మారింది. ప్రభుత్వ అధికారుల మంజూరు తప్పనిసరి అనే నిబంధన వల్ల బడానేతలు మాత్రమే లాభపడే అవకాశం ఉంది. బ్లాక్ మార్కెట్ లో అధిక రేట్లు అమ్ముకుని సొమ్ము చేసుకునే దళారీ వ్యవస్ధ పెరిగే అవకాశం ఉంది.