Breaking NewsHome Page SliderPoliticsTelanganaTrending Today

ఉదయం నోటిఫికేషన్ …సాయంత్రం స్టే

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్సాహం నెలకొన్న వేళ హైకోర్టు తీర్పు పెద్ద బ్రేక్ వేసింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులతో ఎన్నికల ప్రక్రియలో కొత్త మలుపు తిరిగింది. ఉదయానికే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా, సాయంత్రానికే కోర్టు ఆదేశాలు రావడంతో ఆశావహులు గందరగోళానికి గురయ్యారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఉదయం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ కదలికలు వేగం పుంజుకున్నాయి. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా ఉన్న అనేకమంది నాయకులు నామినేషన్ల దాఖలుకు సిద్ధమయ్యారు. అయితే, అదే రోజు సాయంత్రం హైకోర్టు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై స్టే విధించడంతో రాజకీయ రంగంలో కలకలం రేగింది.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో, ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్‌పై ఎన్నికల సంఘం (EC) తదుపరి చర్యలపై స్పష్టత లేకుండా పోయింది. కోర్టు ఆదేశాల కాపీ అందిన వెంటనే తమ నిర్ణయం ప్రకటిస్తామని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సూచనలు అందుతున్నాయి.
ఇక, ఈ పరిణామంతో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. కొత్తగా ఖరారైన రిజర్వేషన్ల ప్రకారం తమ స్థానాలు సాధ్యమవుతాయని నమ్మి, కొందరు ఇప్పటికే గ్రామాల్లో ఎన్నికల ఖర్చులు ప్రారంభించారు. ఇప్పుడు హైకోర్టు స్టేతో ఆ ప్రణాళికలు గందరగోళంలో పడిపోయాయి. “రిజర్వేషన్లు మారితే మా భవిష్యత్తు ఏమవుతుంది?” అనే ప్రశ్న ప్రతీ అభ్యర్థి మనసులో తిరుగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల స్థానాలను తిరిగి కేటాయించింది. ఈ నిర్ణయంతో బీసీ నాయకుల్లో ఆనందం నెలకొన్నా, హైకోర్టు తీర్పుతో ఆ ఉత్సాహం ఒక్కసారిగా చల్లారిపోయింది.
ఇప్పటికి స్థానిక ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్ల అమలు – రెండూ అనిశ్చితిలో ఉన్నాయి. హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఒకవైపు ప్రభుత్వ నిర్ణయం, మరోవైపు న్యాయస్థానం ఆదేశాలు – ఈ రెండింటి మధ్య స్థానిక ఎన్నికల భవితవ్యం ఇప్పుడు సస్పెన్స్‌లో ఉంది.