Andhra PradeshHome Page Sliderhome page slider

23 మంది ఎమ్మెల్యేలకు ఇద్దరు మంత్రులకు నోటీసులు

మంగళగిరి: తెలుగుదేశం పార్టీ జనరల్‌ సెక్రటరీ, మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జోనల్ కో-ఆర్డినేటర్లతో మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ పై నిర్లక్ష్యం, కార్యకర్తలను పట్టించుకోని నేతల వ్యవహారంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రీవెన్స్ మీటింగులు నిర్వహించని 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులకు ఫార్మల్ నోటీసులు వెంటనే జారీ చేయాలని జోనల్ ఇన్‌చార్జ్‌లకు ఆదేశాలు ఇచ్చారు. “మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం ప్రదర్శించడం అసహ్యం. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేయడం నా బాధ్యత,” అని లోకేశ్ పేర్కొన్నారు. అదే సమయంలో, పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులను డిసెంబర్ 1 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అలాగే, 10 రోజుల్లో పార్టీ కమిటీలు, పెండింగ్‌లో ఉన్న అన్ని పోస్టుల నియామకాలు పూర్తిచేయాలని ఆయ‌న ఆదేశించారు.
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు నేతలు తమ నియోజకవర్గాల్లో కార్యకర్తలను, ప్రజలను విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీవెన్స్ డేస్ నిర్వహించకపోవడం, ప్రజా దర్బార్‌లు ఏర్పాటు చేయకపోవడం తీవ్రమైన లోపమని అన్నారు. ఈ మేరకు 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులను గుర్తించామని… వారికి ఇది ముందస్తు హెచ్చరిక అని స్పష్టం చేశారు. “మంగళగిరి ప్రజా దర్బార్‌కు ఇతర నియోజకవర్గాల నుంచి ప్రజలు విపరీతంగా వస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ మీటింగులు నిర్వహించడం లేదు,” అని లోకేశ్ ప్రశ్నించారు. వారాంతాల్లో తప్పనిసరిగా గ్రీవెన్స్ మీటింగులు పెట్టాలని, మంత్రులు కూడా టీడీపీ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ సెషన్లలో పాల్గొనాలని ఆయన సూచించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడిన కార్యకర్తలను మరచిపోకూడదని, వారికి గౌరవం ఇవ్వడం పార్టీ నాయకత్వం కర్తవ్యమని, ఈ బాధ్యతను తానే తీసుకుంటానని లోకేశ్ పేర్కొన్నారు. జోనల్ కో-ఆర్డినేటర్లు డిస్ట్రిక్ట్ ఇన్‌చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి క్లస్టర్, యూనిట్, బూత్, కుటుంబ సాధికార సారథి కమిటీలతో సమీక్షలు నిర్వహించాలని, పెన్షన్ పంపిణీ, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు, క్యాడర్ రివ్యూలను చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమాలపై వివరణాత్మక రిపోర్టులు సమర్పించాలని, పార్టీ నాయకత్వం వాటిని రివ్యూ చేస్తుందని చెప్పారు. ప్రజల సమస్యలు నియోజకవర్గ స్థాయిలోనే పరిష్కారం కావాలని లోకేశ్ స్పష్టం చేశారు. అయితే, ప్రజలు తన ప్రజాదర్బార్‌కు రావడం స్థానిక ఎమ్మెల్యేల నిర్లక్ష్యమేనని ఆయన వ్యాఖ్యానించారు.