బీసీలకు న్యాయం జరిగే వరకు తగ్గేదేలేదు
ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో 70కి పైగా బీసీ కులాల నాయకులతో సమావేశమైన ఆమె, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకపోవడం కాంగ్రెస్ వంచన అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఇప్పటి వరకు పార్లమెంట్లో తెలంగాణ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని కోరుతూ, బీసీ సంఘాలతో కలసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రిజర్వేషన్లు సాధించే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కవిత స్పష్టం చేశారు.