ప్రజాపాలన కాదు.. నిర్బంధాల పాలన
రామన్నపేటలో నిర్మించ తలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్ సహా ఇతర నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. స్వేచ్ఛగా జరగాల్సిన ప్రజాభిప్రాయసేకరణ, ఇంతటి నిర్బంధాల మధ్య చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ లో పేర్కొన్నారు. ప్రజాపాలన అంటూ నిర్బంధాల పాలన కొనసాగించడం సిగ్గుచేటన్నారు. అక్రమంగా అరెస్టులు చేసిన బీఆర్ఎస్ నాయకులను, ప్రజా సంఘాల నేతలను, పర్యావరణవేత్తలను తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు చెప్పారు.