మైనర్ విద్యార్థులను కాల్చి చంపిన ఉత్తర కొరియా
ఉత్తర కొరియా ప్రభుత్వం నిరంకుశ పాలనకు పాపం ఆదేశ విద్యార్థులు బలై పోతున్నారు. రెండు నెలల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన సినిమాలు, వీడియోలు చూసిన పాపానికి ఇద్దరు విద్యార్థులను కనికరం లేకుండా కాల్చి చంపారు. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ చెప్పిందే శాసనం. అతని ఆదేశాలను అందరూ పాటించవల్సిందే. లేకపోతే శిక్ష తప్పదు. పాశ్చాత్య ప్రభావానికి ఆదేశ పౌరులు చాలా దూరంగా ఉంటారు. కనీస టెక్నాలజీ అయిన టీవీ, రేడియోలు కూడా వారికి అందని ద్రాక్షే. ఇక ప్యాషన్ దుస్తులు, ఇంటర్నెట్ వినియోగంపై విపరీతమైన ఆంక్షలు ఉంటాయి. ఈ ఆంక్షలను ఎవరైనా అతిక్రమిస్తే వారికి మరణమే శరణ్యం. వారు చిన్నపిల్లలైనా, మహిళలైనా ఇదే శిక్ష. ఉత్తర కొరియాలోని ర్యాంగాంగ్ ప్రావిన్స్, చైనాకు దగ్గరగా ఉండడంతో వారికి సినిమాలు కొంత అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ ప్రదేశానికి చెందిన ఇద్దరు హైస్కూలు విద్యార్థులు అక్టోబరు నెలలో దక్షిణ కొరియా సినిమాలు, అమెరికన్ డ్రామాలు చూశారని, వారికి మరణశిక్ష విధించి, బహిరంగంగా కాల్చి చంపిన విషయం వెలుగులోకి వచ్చింది.

