Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsPoliticsviral

“అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు – పెద గంట్యాడను రక్షించుకుందాం”

“అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు – పెద గంట్యాడను రక్షించుకుందాం” అంటూ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున జిల్లాలోని గాజువాక పరిధిలోని పెద గంట్యాడ గ్రామ స్థానికులు, ముఖ్యంగా మహిళలు, యువకులు గ్రామంలోని ప్రధాన రహదారులపై బుధవారం ఆందోళనకు దిగారు.విశాఖ జిల్లా మళ్లీ ఆందోళనలకు వేదికగా మారింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇటీవల హోంమంత్రి అనితకు పాయకరావుపేటలో ఎదురైన చేదు అనుభవం మరవకముందే, అదే జిల్లాలోని గాజువాక పరిధిలోని పెద గంట్యాడ ప్రాంతం ప్రజా నిరసనలతో దద్దరిల్లింది. ప్రతిపాదిత అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు రోడ్డెక్కారు. బుధవారం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం రణరంగంగా మారడంతో అక్కడ ఉద్రిక్తత చెలరేగింది.

సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున స్థానికులు, ముఖ్యంగా మహిళలు, యువకులు గ్రామంలోని ప్రధాన రహదారులపై ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి, వ్యవసాయ భూములు నాశనం అవుతాయని, స్థానిక ఉపాధి అవకాశాలు కోల్పోతామనే భయంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే మా ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. వాటి వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. గాలి, నీరు, నేల కాలుష్యం కారణంగా మా పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. ఇప్పుడు మరో సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే మేమెట్లా బతుకుతాం? అని ప్రశ్నించారు. పరిశ్రమల విస్తరణ పేరుతో ప్రభుత్వాలు ప్రజల జీవనోపాధిని తాకట్టు పెడుతున్నాయని విమర్శించారు.

సీపీఎం, పలు ప్రజా సంఘాల నేతలు కూడా గ్రామస్తులకు మద్దతుగా నిలబడ్డారు. ఫ్యాక్టరీ నిర్మాణ ప్రణాళికను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. స్థానిక నాయకుడు పల్లా శ్రీనివాస్‌పై కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రజల మద్దతు లేకుండా, కాలుష్య పరిశ్రమల కోసం ప్రాంతాన్ని తాకట్టు పెట్టకండి” అంటూ నినాదాలు చేశారు.

ఇక అధికారులు మాత్రం ప్రజల అభిప్రాయాలను నమోదు చేసుకున్న తర్వాత నివేదికను తయారుచేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. అయితే గ్రామంలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. పోలీసుల మోహరింపు, ప్రజల ఆందోళనలతో పెద గంట్యాడ ప్రాంతం ‘హైటెన్షన్’ వాతావరణంలో మునిగిపోయింది.
విశాఖ జిల్లా పరిశ్రమల విస్తరణపై ప్రజా వ్యతిరేకత మళ్లీ తలెత్తింది. పాయకరావుపేట తర్వాత పెద గంట్యాడలోనూ ప్రజల ఆగ్రహం ఉధృతమవుతుండటం ప్రభుత్వానికి కొత్త సవాల్‌గా మారింది.