NewsTelangana

నాకు కొత్త వాహనం ఇచ్చేందుకు కేటీఆర్‌ అనుమతి లేదా.. ఐజీకి రాజాసింగ్‌ ఘాటు లేఖ

‘నాకు కొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ఇవ్వడానికి కేటీఆర్‌ అనుమతి లేదా..? లేకుంటే అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా..?’ అని ప్రశ్నిస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ ఐజీకి లేఖ రాశారు. తనకు కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందని.. దాన్ని మార్చాలని లేఖలో కోరారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ తనకు కేటాయించిన వాహనం రోడ్డుపై హఠాత్తుగా ఆగిపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం అధికారులకు చెబితే.. రిపేర్‌ చేసి అదే వాహనాన్ని మళ్లీ కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వాహనం ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుండటంతో అత్యవసర పనుల నిమిత్తం ఎక్కడికీ వెళ్లలేకపోతున్నానని చెప్పారు.

డొక్కు వాహనాన్ని తీసుకెళ్లాలి..

ఇటీవల కొందరు ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు కేటాయించారని.. అందులో తన పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని ఐజీకి రాసిన లేఖలో రాజాసింగ్‌ పేర్కొన్నారు. తనకు నక్సలైట్ల నుంచి ముప్పు ఉన్న విషయం తెలిసినప్పటికీ భద్రత కల్పించడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రాజాసింగ్‌ ఆవేదన వెలిబుచ్చారు. కొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కేటాయించకుంటే.. పాత వాహనాన్ని కూడా తీసుకెళ్లాలని.. డొక్కు వాహనాన్ని ఉపయోగించలేనని లేఖలో రాజాసింగ్‌ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు కొత్త వాహనాలు ఇచ్చి.. తనకు ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇంతటి దుస్థితి వస్తుందని తాను ఊహించలేదన్నారు.