“ఎవ్వరికీ రెండో ఛాన్స్ ఉండదు”..చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వివిధ శాఖల కార్యదర్శులు, మంత్రులు, విభాగాధిపతులతో సచివాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పనిచేయని అధికారులను ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. ప్రతీ ఒక్కరికీ ఒకటే ఛాన్స్ అనీ, రెండవ ఛాన్స్ ఉండదని స్పష్టం చేశారు. ప్రతీ విభాగానికి తగిన వ్యక్తులనే నియమించానని అనుకుంటున్నానని పేర్కొన్నారు. గతంలో కొందరు అధికారుల పనితీరులో ఫలితాలు కనిపించకపోయినా మరో అవకాశం ఇచ్చానని, ఇప్పుడు అలా ఇవ్వనని కఠినంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వం ఎలా నడపాలో ఆయన ప్రణాళికలు వేసుకున్నట్లు తెలిపారు. దానికి తగిన నియమనిబంధనలు అందరికీ తెలియజేస్తామన్నారు. పనులు చేయడానికి డబ్బుల్లేవని ఎవ్వరూ వంకలు చెప్పొద్దని, డబ్బులు లేకుండా చేసే పనులు కూడా చాలా ఉన్నాయని, వాటిపై దృష్టి పెట్టాలన్నారు.
కేంద్రం నుండి నిధులు తెచ్చేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. వివిధ శాఖలకు కేటాయించిన నిధుల్లో మన రాష్ట్రానికి ఏ మేరకు తెచ్చుకోగలమో అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని చంద్రబాబు తెలిపారు. ఓట్లు వేరు, ప్రజలకు మంచి చేయడం వేరు. మనం చేసే ప్రతీ పనికీ రాజకీయ ప్రయోజనం లేకపోవచ్చు కానీ మంచి చేశామనే తృప్తి ఉంటుంది. వైసీపీ విధ్వంసం వల్ల చెల్లించాల్సిన బిల్లులు,బకాయిలు రూ.లక్ష కోట్ల వరకూ ఉన్నాయన్నారు.రాష్ట్రానికి సాయం అందించడానికి కేంద్రం ముందుకు వచ్చి, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులివ్వడం మంచి పరిణామం అని పేర్కొన్నారు.

