ఏ తల్లికీ కిరీటం ఉండదు
ప్రపంచంలో ఏ తల్లికి కిరీటం ఉండదని,కేవలం దేవతలకు మాత్రమే కిరీటాలుంటాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.అసెంబ్లీ సమావేశాల వేదికగా తెలంగాణ తల్లి అంశంపై చర్చకు అనుమతిచ్చి మాట్లాడారు. తెలంగాణ తల్లి అనేది భావన కాదని,అదొక భావోద్వేగమని రేవంత్ ఉద్విగ్నంగా మాట్లాడారు.గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ తల్లి రూపు మనుగడ కోల్పోయిందన్నారు.పదేళ్ల నుంచి తెలంగాణకు ప్రాంతీయ గీతమే లేకుండా పోయిందన్నారు.ఉద్యమ స్పూర్తిని ప్రతిబింబించేలా తల్లిని తీర్చిదిద్దామన్నారు.సమ్మక్క-సారలమ్మ,చాకలి ఐలమ్మ స్పూర్తితో అందరూ హర్షించేలా రూపుదిద్దామన్నారు. తెలంగాణ తల్లిని గత పాలకులు అధికారికంగా గుర్తించలేదని,మొట్టమొదటి సారిగా డిసెంబర్9న అధికారికంగా ప్రకటిస్తున్నామన్నారు. తెలంగాణ తల్లి అంటే రాష్ట్ర ప్రజల తల్లి అనే భావనతోనే అన్నీ పార్టీలకు ఆహ్వానం పంపామన్నారు. ఇక నుంచి ప్రతీ ఏటా ఇదే రోజున తెలంగాణ తల్లి ఆవిర్భావ వేడుకలు జరుగుతాయని రేవంత్ స్పష్టం చేశారు.