NationalNews

టీఆర్‌ఎస్‌తో ఇక తాడోపేడో.. రాష్ట్ర బీజేపీకి హైకమాండ్‌ హుకుం

దేశంలోనే సంచలనం సృష్టించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ హైకమాండ్‌ సీరియస్‌ అయింది. టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలను టార్గెట్‌ చేస్తూ ఆరోపణలు చేయడం, దిష్టిబొమ్మలను దహనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలను తిప్పికొట్టాలని.. వాళ్లతో ఇక తాడోపేడో తేల్చుకోవాలని రాష్ట్ర బీజేపీ నాయకులను ఆదేశించింది. ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలోకి బీజేపీని టీఆర్‌ఎస్‌ లాగుతోందని కాషాయ దళ నేతలు భావిస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, రాష్ట్ర బీజేపీ నేతలతో చర్చించినట్లు సమాచారం.

సీబీఐ విచారణకు ఒత్తిడి..

సీబీఐ విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని.. సాధ్యం కాకుంటే కేసును సీబీఐకి అప్పగించేలా హైకోర్టులో పిటిషన్‌ వేయాలని బీజేపీ నిర్ణయించింది. ప్రధానిని, హోం మంత్రిని లక్ష్యంగా చేసుకున్న టీఆర్‌ఎస్‌ను ఎట్టి పరిస్థితిలోనూ క్షమించేది లేదని బీజేపీ హైకమాండ్‌ రాష్ట్ర నేతలకు స్పష్టం చేసింది. ఇది కేసీఆర్‌ ఆడుతున్నడ్రామాగా ప్రజల్లో ఎండగట్టాలని.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రగతి భవన్‌కు ఎలా పంపించారంటూ పోలీసుల తీరును తూర్పారబట్టాలని సూచించింది. ఒక ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఖర్చు చేసే పరిస్థితి ఉందా..? అనే విషయాన్ని ప్రజలకు వివరించాలని ఆదేశించింది.

రంగంలోకి కేంద్ర హోం శాఖ

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అమిత్‌ షాను టీఆర్‌ఎస్‌ టార్గెట్‌ చేయడంతో కేంద్ర హోం శాఖ అలర్ట్‌ అయింది. వందల కోట్ల రూపాయల డీల్‌ అని వస్తున్న వార్తలపై నిగ్గు తేల్చాలని నిర్ణయించింది. ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం రాబట్టేందుకు ఐబీ, ఈడీ, ఐటీలనూ రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. నిజంగానే కోట్ల రూపాయలు చేతులు మారితే.. అంత డబ్బు ఎవరిది..? ఎక్కడి నుంచి వచ్చాయి.. తదితర విషయాలపై సమగ్ర విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం శాఖ ఆదేశించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.