గొడవలు వద్దు – ఇచ్చిపుచ్చుకుందాం
బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఇటీవల రాజకీయం ఊపందుకుంటున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు శాంతియుతంగా స్పందించారు. గురువారం అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నీటి విషయంలో తాను ఎప్పుడూ గొడవల వైపు వెళ్లలేదని, అభివృద్ధి కోసం సహకారంతో ముందుకెళ్లాలని” అభిప్రాయపడ్డారు.చంద్రబాబు స్పష్టం చేస్తూ, గోదావరి నదిలో పుష్కలంగా నీరు ఉందని,ఆ నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు వాడుకోవచ్చన్నారు. ప్రత్యేకంగా, పోలవరం మినహా గోదావరి నదిపై ఉన్న మిగిలిన ప్రాజెక్టులన్నీ అనుమతులు లేకుండానే నిర్మించబడినవని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం ఒక బేసిన్‌కు నీటిని తీసుకెళ్తే, మరొక రాష్ట్రం మరో బేసిన్‌కు తీసుకెళ్తుందన్న విషయాన్ని గుర్తుచేశారు. తన గత పాలనను గుర్తు చేస్తూ చంద్రబాబు, కల్వకుర్తి, దేవాదుల ప్రాజెక్టుల నిర్మాణాన్ని తానే చేపట్టానని, అలాగే ఎల్లంపల్లి, కాళేశ్వరం వంటి తెలంగాణ ప్రాజెక్టులకు ఎలాంటి అడ్డంకులు పెట్టలేదని తెలిపారు. సముద్రంలో కలిసిపోయే నీటిని రెండు రాష్ట్రాలు కలిసి వినియోగించుకోవడంపై ఎవరికీ అభ్యంతరం ఉండకూడదన్నారు.
“రాజకీయాల కోసం నీటి వివాదాలు తగవు”
నీటి విషయంలో రాజకీయాలకంటే ప్రజల అవసరాలే ప్రాధాన్యమన్నారు చంద్రబాబు. “తెలంగాణతో తాను ఎప్పుడూ గొడవ పడలేదని, ప్రజల మేలు కోసం సహకారంతో ముందుకు వెళ్ళాలన్నది తన స్థానం” అని స్పష్టం చేశారు. నీటి వివాదాలను రాజకీయంగా కాకుండా, అభివృద్ధి దృష్టితో చూడాలని పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి స్పందన
అదే సమయంలో, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ లింక్ ప్రాజెక్టుపై కఠిన వైఖరి తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ, “బనకచర్ల లింక్ ప్రాజెక్టు గోదావరి జలాల ట్రైబ్యునల్ (GWDT) నిర్ణయాలను ఉల్లంఘించే ప్రయత్నమని” అభివర్ణించారు. అవసరమైతే న్యాయపరమైన పోరాటానికి సిద్ధమని, తెలంగాణ వాటాలో నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో, బనకచర్ల లింక్ ప్రాజెక్టు రెండు రాష్ట్రాల మధ్య నీటి రాజకీయాలను మళ్లీ తెరపైకి తీసుకురావచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

