దేశంలో 9 రాష్ట్రాల్లో సీబీఐకి నో ఎంట్రీ
తెలంగాణ, మేఘాలయ సహా 9 రాష్ట్రాలు కొన్ని నేరాలను విచారించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈరోజు తెలిపారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DSPE) చట్టం, 1946లోని సెక్షన్ 6 ప్రకారం, సిబిఐ తమ అధికార పరిధిలో దర్యాప్తు చేయడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల నుండి సమ్మతి పొందాలని లోక్‌సభలో లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. DSPE చట్టం, 1946లోని సెక్షన్ 6 నిబంధనల ప్రకారం, నిర్దిష్ట వర్గాలకు వ్యతిరేకంగా నిర్దిష్ట తరగతి నేరాల దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు CBIకి సాధారణ సమ్మతిని మంజూరు చేస్తాయి. నిర్దిష్ట విషయాలను నమోదు చేయడానికి, దర్యాప్తు చేయడానికి ఏజెన్సీని అనుమతిస్తాయని కేంద్ర మంత్రి అన్నారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, మేఘాలయ, మిజోరం, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కేసుల దర్యాప్తు కోసం సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయని తెలిపారు.