అభ్యర్థుల మార్పు లేదు.. ముందుగా ప్రకటించిన వారికే బీఫార్మ్‌లు
క్లారిటీలో కన్ఫ్యూషన్.. జోరుగా ప్రచారం చేయండి. బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ కర్తవ్యబోధ చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయోనన్న అనుమానం నేపథ్యంలో, ప్రచారాన్ని బీఆర్ఎస్ అభ్యర్థులు కొద్దిగా ఆపారు. ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ ద్వారా జమిలీ ఎన్నికలకు కేంద్రం పచ్చజెండా ఊపుతుందన్న చర్చతో గులాబీ దండు అయోమయానికి గురయ్యింది. జమిలీ ఎన్నికలు ఏప్రిల్-మేలో జరుగుతాయన్న అనుమానాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. అయితే పార్లమెంట్ సమావేశాలు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసమన్న క్లారిటీ రావడంతో, త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగరా మోగబోతున్నట్టు క్లారిటీ వచ్చేస్తోంది. దీంతో ఇప్పుడు అభ్యర్థులంతా ప్రజల్లో ఉండాలని కేసీఆర్ తాజాగా ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో నలుగురు అభ్యర్థుల మినహా అభ్యర్థులందరినీ ప్రకటించిన కేసీఆర్, ఇప్పుడు మిగతా నలుగురు అభ్యర్థుల్ని ప్రకటించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇకపై అభ్యర్థులందరూ ఎన్నికల గోదాలోకి దిగాలని కేసీఆర్ ఆదేశాలు పంపించారు. ఎవరూ నిర్లక్ష్యం వహించకుండా, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల్లో అనేక మందిని మార్చే అవకాశం ఉందని చర్చ కేవలం ఊహాగానమేనని రుజువయ్యింది. దీంతో కేసీఆర్ ప్రకటించిన వారందరూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. వాస్తవానికి 20 మంది అభ్యర్థులను తప్పిస్తారన్న అనుమానంతో కొందరు అభ్యర్థులు ప్రచారాన్ని కూడా మొదలుపెట్టలేదు. ఐతే ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అనవసరమైన మార్పులు వద్దని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు.