సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక లేనట్టే!
బీఆర్ఎస్ సీనియర్ నేత, కంటోన్మంట్ ఎమ్మెల్యే జి సాయన్న మృతి చెందడంతో ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుందా.. లేదా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. వాస్తవానికి తెలంగాణలో నవంబర్-డిసెంబర్ నాటికి అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఐతే జనరల్ ఎన్నికలకు ఏడాది లోపు ఉన్నప్పుడు ఏ ఉప ఎన్నికను జరపాల్సిన అవసరం లేదు. పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1956 ప్రకారం కొన్నిసార్లు ప్రత్యేక పరిస్థితుల్లో ఉపఎన్నికలు జరపనక్కర్లేదు. దేశంలో తీవ్రమైన వ్యాధులు ప్రబలినప్పుడు, అంతర్గత అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, సరిహద్దుల్లో సమస్య వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు, ఏడాదిలోపు సాధారణ ఎన్నికలు ఉన్నప్పుడు ఉపఎన్నికలు పెట్టాల్సిన పని లేదు.

ఇక కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సాయన్న చరిత్ర సృష్టించారు. తెలుగు దేశం పార్టీలో చేరిన ఆయన అంచలంచెలుగా ఎదిగారు. వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తూ… ప్రజల్లో పట్టును నిరూపించుకుంటూ వస్తున్నారు. 1994, 1999, 2004, 2014, 2019లోనూ సాయన్న విజయం సాధించారు. 2009లో మాత్రం శంకర్రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. మారుతున్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కంటోన్మెంట్ రాజకీయం రసవత్తరంగా మారనుంది. ఉపఎన్నిక జరుగుతుందా.. లేదా అన్న చర్చ రాజకీయవర్గాల్లో విన్పిస్తున్నా… పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ నిబంధనలు ప్రకారం ఎన్నికలు జరగవు.

సీఎం కేసీఆర్, తెలంగాణ సచివాలయం ప్రారంభించిన వెంటనే అసెంబ్లీని రద్దు చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. అలా చేయడం ద్వారా వచ్చే ఆరు నెలల కంటే ముందుగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అలా జరక్కున్నప్పటికీ… నిబంధనల ప్రకారం కంటోన్మెంట్ ఉపఎన్నికకు ఛాన్స్ లేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో సుమారుగా 2 లక్షల 40 వేల పై చిలుకు ఓట్లున్నాయి. మరేడ్‌పల్లి, తిరుమలగిరి, బొల్లారం, సిక్ విలేజ్, లోతుకుంట, ఖార్ఖానా, బేగం పేట (కొంత ప్రాంతం), రాష్ట్రపతి రోడ్ (కొంత ప్రాంతం) వస్తాయి.