కాషాయ దళానికి కొత్త సారధి నితిన్ నబీన్
భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం లాంఛనంగా చేయనున్నారు. నితిన్ నబీన్ ప్రస్తుతం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగియనున్న క్రమంలో ఈ ఎన్నిక అనివార్యమైంది.
బీహార్ రాష్ట్రానికి చెందిన 46 ఏళ్ల నితిన్ నబీన్ , గత నెల డిసెంబరులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఆయనను పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు అప్పుడే సంకేతాలు వెలువడ్డాయి. నబీన్‌కు ఆరెస్సెస్ నేపథ్యం ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బాంకీపూర్ నుంచి నబిన్ నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిహార్ నుంచి పార్టీ జాతీయ స్ధాయికి ఎదిగిన తొలి నాయకుడుగా నితిన్ నబీన్ ప్రత్యేక గుర్తింపును పొందారు.

