National

కేరళ నరబలి కేసులో కొత్త ట్విస్ట్

కేరళ నరబలి కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. తాజాగా పోలీసులు ఈకేసులో కొత్తకోణం కనిపెట్టారు. లైలా భర్త భనవల్‌సింగ్‌ను కూడా హత్య చేసేందుకు కుట్ర జరిగి ఉండవచ్చని గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ షఫీ తర్వాత టార్గెట్ భగవల్ సింగ్ హత్యే అని భావిస్తున్నారు. అతనిని చంపి లైలాతో కలిసి జీవించేందుకు కుట్ర చేసి ఉండొచ్చని అంచనాలు వేస్తున్నారు.

అతి క్రూరంగా ఇద్దరు మహిళలను హత్యచేసి, వారి శరీరభాగాలను వండుకుని తిన్న ఈ రాక్షస చర్య దేశం మొత్తాన్ని కుదిపేసింది. రోజిలిన్, పద్మ అనే మహిళలను మహ్మద్ షఫీ సూచనలతోనే భగవల్ సింగ్ ఇంటికి తీసుకువచ్చి వారిని ఖండాలుగా నరికి బలి ఇచ్చారు. కొన్ని శరీర భాగాలను వండుకొని కూడా తిన్నట్లు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, సెల్ టవర్ లొకేషన్ సాయంతో నిందితులను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రషీద్ పాఠశాల విద్య కూడా పూర్తి చేయలేదు. కేవలం ఆరో తరగతి చదివి, రకరకాల మారుపేర్లతో ఫేస్ బుక్ ఖాతాలను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. శ్రీదేవి అనే నకిలీ ఫేస్‌బుక్ ఖాతాతోనే భగవల్ సింగ్‌ను బుట్టలో వేసుకున్నాడని తెలిసింది. రెండువారాల పోలీస్ కస్టడీలో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో?