తెలంగాణ లో కొత్త రాజకీయ పార్టీ
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. బుధవారం బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్ కృష్ణా వేదికగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ (TRP) పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. అదే విధంగా ఎరుపు, ఆకుపచ్చ రంగుల కలయికతో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడిగా తీన్మార్ మల్లన్న బాధ్యతలు చేపడుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మారం రజినీ కుమార్ యాదవ్, సూడగాని హరిశంకర్ గౌడ్‌లను నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా వట్టే జానయ్య యాదవ్, సంగెం సూర్యారావు, పల్లెబోయిన అశోక్ యాదవ్, జ్యోతి వండల్ కొనసాగనున్నారు. యువతకు కూడా త్వరలోనే కార్యవర్గంలో అవకాశం కల్పిస్తామని తీన్మార్ మల్లన్న హామీ ఇచ్చారు. మిగతా విభాగాలకు సంబంధించిన బాధ్యతలను త్వరలోనే ఎన్నుకుని ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

