Home Page SliderTelangana

తెలంగాణ బీజేపీలో కొత్త జోష్

తెలంగాణలో దూకుసుపోతున్న కాషాయదళం
ఓవైపు కిషన్ రెడ్డి మరోవైపు ఈటల దూకుడు
రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ పెద్దల మార్గదర్శనం
అభ్యర్థుల ఎంపికపై ఫుల్ క్లారిటీతో అడుగులు
త్వరలోనే 50 మంది అభ్యర్థులతో జాబితా
బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను ఓడించేలా వ్యూహాలు

తెలంగాణ రాజకీయాల్లో మునిగేది ఎవరూ తెలేదవరన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి విజయతీరాలకు చేరాలని, హాట్రిక్ కొట్టాలని తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తుంటే అందుకు భిన్నమైన పరిస్థితులు తెలంగాణలో కనిపిస్తున్నాయి. ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారన్న భావన ప్రజల్లో నెలకొనడంతో అందరి చూపు ప్రత్యామ్నాయం వైపు పడుతోంది. ఆ బంధు, ఈ బంధు అంటూ ఆరంభ శూరత్వమే తప్పించి, తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్న భావన సామాన్య ఓటరు నుంచి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచినా, చివరాకరకు వారు, కారు పార్టీ తీర్థం పుచ్చుకోరన్న గ్యారెంటీ ఏం లేకపోవడంతో.. తెలంగాణలో తటస్థులు, కేసీఆర్ వ్యతిరేకలంతా బీజేపీ వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో విజయం సాధించాలని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేశాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణ స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి… ప్రస్తుతం కొంత మేర ఆశావాహ దృక్పథం కలుగుతోంది.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో పరిస్థితులు మారాయన్న ప్రచారం జోరందుకొంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తెలంగాణలో ఆ పార్టీకి కొంత సానుకూల వాతావరణం ఏర్పడినప్పటికీ ప్రజల్లో ఆ ఫీలింగ్ ఎంతవరకు ఉందన్న దానిపై క్లారిటీ మిస్ అవుతోంది. గత నెల రోజులు కాలంలో తెలంగాణ విషయంలో వచ్చిన అనేక సర్వేలు తెలంగాణలో బీజేపీ గతానికంటే బలంగా తయారైందన్న భావనను వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఎస్టీ, బీసీల్లోని మెజార్టీ వర్గాలు కాషాయం పార్టీ వైపు చూస్తోండటంతో అటు అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వెన్నులో వణుకుపుడుతోంది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్ పార్టీకి 8, బీజేపీకి 6, కాంగ్రెస్ పార్టీకి రెండు, మజ్లిస్ ఒక్క స్థానంలో విజయం సాధిస్తుందని India Tv- CNX సర్వే అంచనా వేసింది. మొత్తంగా తెలంగాణలో మరోమారు విజయం సాధించాలని కేసీఆర్ తహతహలాడుతుంటే… బీజేపీ అధికారాన్ని చేపట్టేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎన్నికల కమిటీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ నియామకంతో తెలంగాణలో బీజేపీలో జోష్ పెరిగింది.

మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న వాతావరణం ఇప్పుడు ఫుల్ క్లారిటీగా కనిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించే విధంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అభ్యర్థులు ఎంపిక పూర్తి చేసిన కాషాయ దళం త్వరలో 50 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేయాలని భావిస్తోంది. గత ఆరు నెలలుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు జాబితాలు తయారు చేశామంటున్నా, బయటకు మాత్రం ఇప్పటి వరకు రిలీజ్ చేసేందుకు తర్జనభజన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వారం పది రోజుల్లో బీజేపీ తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను పార్టీ పెద్దలు పూర్తి చేశారు. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అభ్యర్థుల ఎంపిక చేసి, జాబితాను పార్టీ హైకమాండ్‌కు సమర్పించినట్టు తెలుస్తోంది.